
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా పనిచేసి, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూ, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు మధ్య అనుబంధం పలుమార్లు బహిరంగంగానే కనిపిస్తుంటుంది. కానీ ఓ విషయంలో
మాత్రం వీరిద్దరికీ మధ్య చిన్న విషయంలో ఓ తేడా వచ్చింది. పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తీసుకున్న ఓ నిర్ణయంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో గంటల వ్యవధిలోనే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ మేరకు అధికారులతో సమీక్షలో ప్రకటించారు.తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తాజాగా అక్కడి మునికూడలి ఘాట్ కు మంత్రి నారా లోకేష్ కుమారుడైన నారా దేవాన్ష్ పేరుతో దేవాన్ష్ ఘాట్ గా పేరు ఖరారు చేశారు. దీంతో అలజడి చెలరేగింది. వాస్తవానికి రాష్ట్రంలో చంద్రబాబు పేరు తప్ప లోకేష్ పేరు కూడా ఎక్కడా పథకాలకు కూడా కనిపించదు. అలాంటిది దేవాన్ష్ పేరును ఘాట్ కు పెట్టడం వివాదాస్పదమైంది. దీనిపై మీడియాలో వచ్చిన వార్తలపై లోకేష్ ఎక్స్ లో తీవ్రంగా స్పందించారు.ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, ఏ ఘాట్‌కు కూడా దేవాంశ్ పేరు పెట్టకూడదని తాను ఆదేశాలు జారీ చేశానని, ఈ విషయంపై మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ మీడియాను ఉద్దేశించి లోకేష్ ట్వీట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇవాళ నిర్వహించిన సమీక్షలో ఈ వ్యవహారాన్ని చర్చించారు. మునికూడలి ఘాట్ జాతీయ స్థాయి మోడల్ కావాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే సీతానగరం వద్ద ఉన్న మునికూడలి ఘాట్ ను జాతీయ స్థాయి మోడల్ ఘాట్ గా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని, కాబట్టి దీన్ని సప్తర్షి పుష్కర్ ఘాట్ పేరిట తీర్చిదిద్దాలని ఆదేశాలు ఇచ్చారు. తద్వారా వివాదానికి ముగింపు పలికారు.