
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు అమెరికా పార్లమెంట్ బ్రేకులు వేసింది. ఇరాన్‌తో ముదురుతున్న వివాదంపై అమెరికా పార్లమెంట్ అధికారికంగా ఆమోదం తెలిపే వరకు సైనిక చర్యలను పూర్తిగా నిలిపివేయాలని
కోరుతూ డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన వార్ పవర్స్ రెజల్యూషన్ దిగువ సభలో పాస్ అయింది. ఈ కీలక తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 208 ఓట్లు పడ్డాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లిక్ పార్టీకి చెందిన నలుగురు ప్రతినిధులు పార్టీ విప్‌ను సైతం ధిక్కరించి మరీ డెమొక్రాట్లతో చేతులు కలిపారు. అధ్యక్షుడి మిలిటరీ అధికారాలను కట్టడి చేయాలనే డెమొక్రాట్ల పోరాటానికి రిపబ్లికన్ల నుంచి కూడా మద్దతు పెరుగుతుండటం అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అమెరికా చట్టాల ప్రకారం.. పార్లమెంట్ అనుమతి లేకుండా అధ్యక్షుడు ఏ విదేశీ భూభాగంలోనైనా కేవలం 60 రోజులు మాత్రమే సాయుధ బలగాలను ఉంచగలరు. ఇరాన్‌పై నిర్వహిస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి వైట్ హౌస్ ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఆపరేషన్ ఇప్పటికే 60 రోజుల పరిమితి దాటిందని పర్యవేక్షక సంస్థలు చెబుతున్నాయి. అయితే ఏప్రిల్‌లో ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించినప్పుడే ఆ 60 రోజుల గడువు మళ్లీ మొదటికొచ్చిందని డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ వాదిస్తున్నారు.
మొత్తానికి రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు డెమొక్రాట్లతో కలిసి ఓటేసి తీర్మానం నెగ్గడంతో యుద్ధం-శాంతి ప్రశ్నపై పార్టీల కంచెలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ చర్య చట్టపరంగా తక్షణ ప్రభావం చూపకపోయినా, రాజకీయంగా మాత్రం గట్టి దెబ్బ అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఎందుకంటే సెనేట్, హౌస్ రెండూ ఆమోదించినా, ఇది అధ్యక్షుడి వీటోను దాటేందుకు మెజారిటీ అవసరం, అది ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో దాదాపు అసాధ్యం. ఇప్పటికి మాత్రం, ఈ తీర్మానం ట్రంప్‌కు స్పష్టమైన సందేశం పంపింది. యుద్ధాన్ని ఏకపక్ష నిర్ణయాలతో నడపడం అంత సులువు కాదని స్పష్టం చేసింది.
సత్ఫలితాలిస్తున్న భారత్, చైనా నియంత్రిత శత్రుత్వం
.