
E85 Fuel: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదల మీద జనం గగ్గోలు పెడుతున్నారు. ఆయిల్ కంపెనీలు మెల్ల మెల్లగా రేట్లు పెంచుకుంటూ పోవడంతో వాహనదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ క్రమంలో కేంద్ర
ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. E85 పెట్రోల్ మీద లీటర్ కు రూ.20 తగ్గిస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు.
ప్రస్తుతం మార్కెట్లో E20 పెట్రోల్ అందుబాటులో ఉంది. అంటే 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అన్నమాట. అయితే, ఈ E85 అనేది ఇంకా అడ్వాన్స్ డ్ పెట్రోల్. ఇందులో 85 శాతం ఇథనాల్ ఉంటుంది. కేవలం 15 శాతం మాత్రమే పెట్రోల్ ఉంటుంది. దీని రేటు చూస్తే సుమారు రూ.82 ఉంటుంది. అందులో ఇప్పుడు రూ.20 తగ్గిస్తారు. ఆ లెక్కన లీటర్ E85 పెట్రోల్ కేవలం రూ.62కి లభిస్తుంది.
మామూలు పెట్రోల్, E20 అయితే దాదాపు అన్ని వాహనాలకు పనిచేస్తుంది. అయితే, E20 వల్ల మైలేజ్ సమస్యలు, ఇంజిన్ సమస్యలు వస్తున్నాయని కంప్లెయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా 85 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అన్ని వాహనాలకు సెట్ అవుతుందా అంటే.. కాదు. అది కేవలం ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కి మాత్రమే సెట్ అవుతుంది.
మారుతీ సుజుకీ వాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఒక్కటే అందుబాటులో ఉంది. టొయోటా, టాటా, మహీంద్రా, హుందై లాంటి కంపెనీలు కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లను తీసుకొస్తున్నాయి.