
ప్రోటీన్ మన శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకాల్లో ఒకటి. ఇది కండరాల నిర్మాణం, శక్తి పెంపు, బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో
తగినంత ప్రోటీన్ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గోధుమ పిండిలో మూడు పదార్థాలను కలపడం ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పొందొచ్చు.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గోధుమ పిండిలో సోయా పిండి, శనగపిండి, సత్తూ కలిపితే అది ప్రోటీన్ రిచ్ పిండిగా మారుతుంది. ఇందుకోసం 1 కప్పు గోధుమ పిండి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు సోయా పిండి, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు సత్తూ పిండిని వేసి బాగా కలిపి ముద్దలా చేసి రొట్టెలు తయారు చేసుకోవచ్చు.
సోయాను వృక్ష ఆధారిత ప్రోటీన్‌కు అద్భుతమైన వనరుగా భావిస్తారు. 100 గ్రాముల సోయా పిండిలో సుమారు 35 నుంచి 40 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. సోయా పిండిలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. సోయా పిండి కండరాలను బలపరచడంలో, బరువు నియంత్రణలో, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడుతుంది.
శనగపిండి కూడా ప్రోటీన్‌తో పాటు అనేక పోషకాలను అందిస్తుంది. 100 గ్రాముల శనగపిండిలో సుమారు 20 నుంచి 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. శనగపిండి కలపడం వల్ల గోధుమ పిండికి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీని వల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటుంది. అందుకే మధుమేహం ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
సత్తూను చాలా మంది సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. 100 గ్రాముల సత్తూ పిండిలో సుమారు 18 నుంచి 22 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఈ పిండిలో ఫైబర్, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గోధుమ పిండిలో సత్తూ కలపడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరానికి చల్లదనాన్ని అందించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా రొట్టెల పోషక విలువలు మరింత పెరుగుతాయి.
సోయా పిండి, శనగపిండి, సత్తూ కలిపిన గోధుమ పిండి సాధారణ గోధుమ పిండితో పోలిస్తే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి త్వరగా వేయదు.