ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజ్యసభ సీట్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా.. అందులో మూడు టీడీపీ. ఒకటి జనసేన తీసుకోవాలని ఎన్డీఏ కూటమి నేతల సమావేశంలో నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజ్యసభ సీట్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా.. అందులో మూడు టీడీపీ. ఒకటి జనసేన తీసుకోవాలని ఎన్డీఏ కూటమి నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో రెండు రాజ్యసభ స్థానాలు బీజేపీకి కేటాయించిన కారణంగా ఈసారికి ఆ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో నాలుగు సీట్లలో మూడు తెలుగుదేశం, ఒకటి జనసేన పార్టీలు పంచుకుంటున్నాయి. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం నాలుగు సీట్లు కూటమి పార్టీలకే దక్కే అవకాశం ఉండటంతో.. టీడీపీ, జనసేన నుంచి పెద్దల సభకు వెళ్లేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరికి తోచిన రీతిలో, ఎవరికి సాధ్యమైన దారిలో వారు లాబీయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ఖరారైనట్లు సమాచారం. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటన చేస్తారని తెలిసింది. అభ్యర్థులుగా ఒకరిద్దరు పేర్లు చర్చకు వచ్చినప్పటికీ లింగమనేని వైపే పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించినట్లు సమాచారం. జనసేన పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిపై ఓ క్లారిటీ రాగా.. మరి టీడీపీ సంగతి ఏంటనేది పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి పలువురు సీనియర్ నేతలు రాజ్యసభ బరిలో ఉన్నారు. కంభంపాటి రామ్మోహన్ రావు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వరరావు వంటి సీనియర్లతో పాటుగా.. చింతకాయల విజయ్, గల్లా జయదేవ్ వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే సానా సతీష్ బాబుకు మరోసారి ఛాన్స్ ఇవ్వొచ్చన్న వార్తలు కూడా వస్తున్నాయి. నారా లోకేష్ సన్నిహితుడిగా ఉన్న రాజేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు మనసులో ఎవరున్నారనేదీ ఆసక్తికరంగా మారింది. సాధారణంగా చంద్రబాబు ఏ విషయంలోనైనా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే టీడీపీ రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి కమ్మ, కాపు, ఎస్సీ సామాజికవర్గాల గురించి ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లకు జూన్ 8వ తేదీ వరకూ గడువు ఉంది. ఈ నేపథ్యంలో శని, లేదా ఆదివారంలోగా టీడీపీ రాజ్యసభ అభ్యర్థులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.