
వైట్‌బాల్ క్రికెట్లో టీమ్ఇండియానే ఫేవరెట్! ఇక పొట్టి ఫార్మాట్లో అయితే రూటే సపరేట్! రెడ్‌బాల్ క్రికెట్లో మాత్రం.. కొంతకాలంగా భారత్ తడ‘బ్యాటు’కు గురవుతోంది! రోహిత్-కోహ్లీ నిష్క్రమణ తర్వాత
వైట్‌బాల్ క్రికెట్లో టీమ్ఇండియానే ఫేవరెట్! ఇక పొట్టి ఫార్మాట్లో అయితే రూటే సపరేట్! రెడ్‌బాల్ క్రికెట్లో మాత్రం.. కొంతకాలంగా భారత్ తడ‘బ్యాటు’కు గురవుతోంది! రోహిత్-కోహ్లీ నిష్క్రమణ తర్వాత కాస్త వెనకబడింది టీమ్ లైనప్‌లో యువరక్తానికి పెద్దపీట వేసి తిరిగి పుంజుకోవాలని చూస్తోంది..
క్రికెట్ అభిమానులకు వినోదాలు పంచిన.. ఐపీఎల్ పోరు ముగిసింది. ఇప్పుడిక భారత్ ప్రపంచ యవనికపై క్రికెట్ కదనరంగంలోకి తిరిగి దూకనుంది! శనివారం నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఇందులో భాగంగా ఏకైక టెస్ట్ మ్యాచ్ ముల్లాన్‌పూర్ వేదికగా ప్రారంభం కానుంది. టీమ్ఇండియాకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
ఈ మ్యాచ్ ఫలితం డబ్ల్యూటీసీలో భారత ర్యాంకింగ్‌ను ప్రభావితం చేయలేదు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రధానంగా.. భవిష్యత్తులో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరగనున్న కీలకమైన డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్‌లకు సన్నద్ధం కావడానికి ఈ మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం కానుంది.
అఫ్గానిస్థాన్‌తో భారత్ ఆడనున్న టెస్ట్ మ్యాచ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికపై ప్రభావం చూపదు. ఎందుకంటే, అఫ్గానిస్థాన్ డబ్ల్యూటీసీలో భాగస్వామి కాదు. అలాగే, ఐసీసీ నిబంధనల ప్రకారం డబ్ల్యూటీసీ పరిధిలోకి రావాలంటే ఏదైనా సిరీస్‌లో కనీసం రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఉండాలి. ఈ మ్యాచ్‌కు టెస్ట్ హోదా ఉన్నప్పటికీ, ఇది కేవలం రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక మ్యాచ్ మాత్రమే. అందుకే, ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా, ఓడినా డబ్ల్యూటీసీ పాయింట్లు మారవు.
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత భారత్ రెడ్ బాల్ క్రికెట్లోకి ఈ మ్యాచ్ ద్వారానే అడుగుపెట్టనుంది. భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఈ ఓటమి తర్వాత భారత్ ఆడనున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది చివర్లో భారత్ శ్రీలంక, న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. రెడ్ బాల్ క్రికెట్లో టీమ్ఇండియా తిరిగి పుంజుకోవడానికి, జట్టు కూర్పును మెరుగుపరచుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం. భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా గిల్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు. అలాగే, కేఎల్ రాహుల్ నూతన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇంతకు ముందు అఫ్గానిస్థాన్ తొలిసారిగా 2018లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇన్నింగ్స్, 262 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది జరిగిన ఎనిమిదేళ్ల అనంతరం అఫ్గానిస్థాన్ ముల్లాన్‌పూర్ వేదికగా భారత్‌తో తలపడనుంది. టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్- కోహ్లీ నిష్క్రమణ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా సంధి దశలో ఉంది. రెడ్ బాల్ క్రికెట్లో తిరిగి సత్తా చాటాలని చూస్తున్న భారత్ తన ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.