
Polymer currency notes| ఇంటర్నెట్‌డెస్క్: పాలిమర్ కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లను చలామణిలోకి తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
Polymer currency notes| ఇంటర్నెట్‌డెస్క్: పాలిమర్ కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లను చలామణిలోకి తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు.
కాగితపు కరెన్సీకి ఉన్న గిరాకీ నేపథ్యంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ముద్రించాలన్న ఆలోచనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదేళ్ల క్రితమే ప్రతిపాదించింది. కాగితపు కరెన్సీని ముద్రించడానికి అయ్యే వ్యయం, నోట్లు చేతులు మారే క్రమంలో అవి పాడైపోవడం వంటి వాటిని దృష్టిలోఉంచుకొని అప్పట్లో ఆర్బీఐ (RBI) ఆ ప్రతిపాదన చేసింది. దేశవ్యాప్తంగా ట్రయల్ పద్ధతిలో రూ.10 విలువైన ఒక బిలియన్ ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆ సమయంలో పార్లమెంట్‌కు కేంద్రం తెలియజేసింది. అందుకు కొచ్చి, మైసూర్, జైపుర్, శిమ్లా నగరాలను ఎంచుకుంది. అయితే సాంకేతిక, కార్యాచరణ సమస్యల కారణంగా ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు.
మరోవైపు.. మార్కెట్లో నకిలీ నోట్ల చలామణి స్వల్పంగా పెరగడంతో, వాటిని అరికట్టేందుకు, నోట్ల మన్నికను పెంచేందుకు ఆర్బీఐ నోట్లలో కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో పాటు, వార్నిష్డ్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల వెల్లడైన వార్షిక నివేదికలో ఆర్బీఐ ఈ విషయాన్ని ప్రస్తావించింది. పలుచని, రక్షిత అల్ట్రా వయొలెట్ క్యూర్డ్ వార్నిష్ పూత పూసిన కాగితపు నోట్లనే వార్నిష్ కరెన్సీగా పిలుస్తారు. తరచూ నోట్లు పాడై, కొత్తవి ముద్రించేందుకు అవుతున్న ఖర్చు తగ్గించేందుకు ఇవి ఉపయోగపడతాయి. సాధారణ నోట్లతో పోలిస్తే, ఇవి 2-3 రెట్లు అధిక కాలం మన్నుతాయన్నది అంచనా.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.