
ధరణి, వసుధ, ఉర్వి... ఇలా పేర్లు పెట్టుకున్నందుకేమో... భువిపైన వచ్చిన ఏ సమస్యకైనా మొదటి బాధితులు మహిళలే అవుతుంటారు. పర్యావరణ మార్పుల ప్రభావమూ మనపైన ఎక్కువగా ఉంటోంది. దాంతో అడుగడుగునా మనుగడకు ఆటంకాలే!
ధరణి, వసుధ, ఉర్వి... ఇలా పేర్లు పెట్టుకున్నందుకేమో... భువిపైన వచ్చిన ఏ సమస్యకైనా మొదటి బాధితులు మహిళలే అవుతుంటారు. పర్యావరణ మార్పుల ప్రభావమూ మనపైన ఎక్కువగా ఉంటోంది. దాంతో అడుగడుగునా మనుగడకు ఆటంకాలే! ఇన్నాళ్లూ భూమాత అంత ఓర్పుతో వీటిని భరిస్తూ వచ్చిన ఆమె... తన ఉనికే ప్రశ్నార్థకమవుతోన్న వేళ వాటికి తగిన జవాబిచ్చే ప్రయత్నం చేస్తోంది!
తమ జీవన విధానంలో పురుషులకంటే మహిళలే ఎక్కువగా సహజ వనరులపైన ఆధారపడుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఆహారం, నీరు, వంటచెరకు బాధ్యత మహిళలూ, బాలికలపైనే ఎక్కువగా ఉంటుంది. అతివృష్టి, అనావృష్టి... ఎలాంటి పరిస్థితి నెలకొన్నా దురదృష్టం మొదట పలకరించేది ఆడవాళ్లనే. ఇప్పటికే తక్కువగా అందుతున్న వనరుల్ని మరింతగా కోల్పోవాల్సిన పరిస్థితి. సాధారణంగా పురుషులకంటే స్త్రీలు రెండున్నర రెట్లు ఎక్కువ సమయం ఇంటి పనుల కోసం కేటాయిస్తారు. వరదలూ, కరవులూ, తుపానులూ... తదితర క్లిష్ట పరిస్థితుల్లో ఈ సమయం ఇంకా పెరుగుతుంది. అలాంటప్పుడు పురుషులకంటే మహిళలకు ప్రాణహాని 14 రెట్లు ఎక్కువని చెబుతున్నాయి నివేదికలు. వాతావరణంలో తీవ్ర మార్పుల వల్ల అమ్మాయిలు చదువులూ, ఉపాధికీ దూరమవ్వాల్సిన దుస్థితి. ఆరోగ్యం మీదా దుష్ప్రభావం చూపుతుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వాతావరణ మార్పుల కారణంగా 2050 నాటికి దాదాపు 15కోట్ల మంది మహిళలూ, బాలికలూ పేదరికంలో కూరుకుపోతారని హెచ్చరిస్తున్నాయి అధ్యయనాలు.
నాయకత్వ, నిర్ణయ స్థానాల్లో స్త్రీలు ఉన్నచోట పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వనరుల పునర్వినియోగం, పొదుపుగా వాడటం, సేంద్రియ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం... ఇవి మహిళల ప్రాధమ్యాలుగా ఉంటాయి. వీళ్లు నాయకత్వ స్థానాల్లో ఉంటే సమాజంలోనూ ఆ దిశగా మార్పు తెస్తారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ఆంత్రప్రెన్యూర్లుగా మారి... తమవైన పరిష్కారాలను చూపుతున్న ఆడవాళ్లూ పెరుగుతున్నారు. కిచెన్ నుంచి వచ్చే చెత్తను ఎరువుగా మార్చుతోంది ‘బిలియన్ కార్బన్’. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థను అంకితా విజయ్వేర్గియా స్థాపించారు. వీళ్లు అభివృద్ధి చేసిన బయోరియాక్టర్‌లో వేసిన చెత్త 72 గంటల్లోనే సేంద్రియ ఎరువుగా మారుతుంది. కోయంబత్తూరుకు చెందిన నివేదా రవికుమార్ స్థాపించిన బ్లిస్ నేచురల్స్... గోంగూర నారతో శానిటరీ ప్యాడ్లను తయారుచేస్తోంది. ఇవి కొన్ని నెలల్లోనే మట్టిలో కలిసిపోతాయి. ‘నెక్సస్ పవర్’ భువనేశ్వర్‌కు చెందిన కవలలు నిషిత, నిఖిత స్థాపించిన సంస్థ. వీళ్లు పంట వ్యర్థాలతో బ్యాటరీలు తయారుచేస్తున్నారు. ఇలా పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా భావిస్తూ... చెత్తను సంపదగా మార్చడం, పర్యావరణ హితమైన ఉత్పత్తులు తీసుకురావడంలో అనేక మంది మహిళలు ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నారు.
పర్యావరణ దినోత్సవం-2026 సందర్భంగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపుఇచ్చింది. ‘సహజ వనరుల విధ్వంసంపైన భూమి దశాబ్దాలుగా ఎన్నో రూపాల్లో సంకేతాలు ఇస్తోంది. అయితే వాటిని గుర్తించడమే కాదు, పర్యావరణ పరిరక్షణకోసం ఎంత వేగంగా స్పందిస్తున్నాం... ఎలాంటి చర్యలు చేపడుతున్నాం... అన్నదీ ముఖ్యమే’ అని గుర్తు చేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.