
Karnataka Politics : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హాజరుకాగా..
Irrigation Minister Ramalinga Reddy resigns
Karnataka Politics : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హాజరుకాగా.. అట్టహాసంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్‌తోపాటు 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే కీలక పరిణామం చోటు చేసుకుంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ తన క్యాబినెట్‌లోని సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖ, క్యాబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగంతోపాటు పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జి.పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడా శాఖలను కేటాయించారు. అలాగే మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా శివకుమార్ క్యాబినెట్లో చోటు దక్కించుకోగా.. ఆయనకు పట్టణాభివృద్ధి (అర్బన్ డెవలప్మెంట్) శాఖను కేటాయించారు. అయితే, శాఖల కేటాయింపుపై కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు తెరపైకి వచ్చాయి.
సీనియర్ నేత, మంత్రి రామలింగారెడ్డి తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రామలింగారెడ్డికి భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖను కేటాయించారు. అయితే, ఆయన బెంగళూరు అభివృద్ధి శాఖను ఆశించారని సమాచారం. దానికి భిన్నంగా శాఖను కేటాయించడంతో రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇష్టం లేని శాఖ కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి రామలింగారెడ్డి శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. నగరాభివృద్ధి శాఖ ఇవ్వాలని విన్నవించినా.. తనకు అవగాహన లేని నీటిపారుదల శాఖ ఇచ్చారంటూ కాంగ్రెస్ నేతల వద్ద ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మాట్లాడారు. ఇక తాను ఏ మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసినా తీసుకోను. కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను. ఎమ్మెల్యేగా కొనసాగుతానని వెల్లడించారు.