
Trisha: తమిళ సినీ పరిశ్రమలో నటీనటులు, నిర్మాతలు కలిసి పనిచేయడం సాధారణ విషయమే. కానీ పరిశ్రమకు బయట నుంచే స్నేహితులుగా ఉండి, ఆ బంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న వారిలో త్రిష, అర్చనా కల్పతి ప్రత్యేకంగా...
Trisha: తమిళ సినీ పరిశ్రమలో నటీనటులు, నిర్మాతలు కలిసి పనిచేయడం సాధారణ విషయమే. కానీ పరిశ్రమకు బయట నుంచే స్నేహితులుగా ఉండి, ఆ బంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న వారిలో త్రిష, అర్చనా కల్పతి ప్రత్యేకంగా నిలుస్తున్నారు.
ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అర్చనా కల్పతి త్రిషతో తన స్నేహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాము సినిమా రంగంలోకి రాకముందే పరిచయం అయ్యామని, ఒకే బ్యాచ్‌లో చదివిన స్నేహితులమని చెప్పారు. చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఈ స్నేహం తమ జీవితంలో ఎంతో ముఖ్యమని తెలిపారు.
అర్చనా మాట్లాడుతూ, “త్రిష నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. మేమిద్దరం చాలా సరదాగా ఉంటాం. మా స్నేహం పూర్తిగా వ్యక్తిగతం. అందుకే దాన్ని వృత్తిపరమైన సంబంధాలతో కలపాలని ఎప్పుడూ అనుకోలేదు” అని చెప్పారు.
ఇదే కారణంగా ఇప్పటివరకు తమ నిర్మాణ సంస్థలో త్రిషతో సినిమా చేయలేదని అర్చనా వెల్లడించారు. స్నేహం మీద ఎలాంటి ప్రభావం పడకుండా ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పరిశ్రమలో చాలామంది స్నేహితులు కలిసి పనిచేస్తున్నప్పటికీ, తమ విషయంలో మాత్రం స్నేహాన్ని ప్రత్యేకంగా ఉంచాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
అయితే నటిగా త్రిషపై అర్చనా ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా కష్టపడే వ్యక్తి అని చెప్పారు. ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ సినిమా విజయాన్ని ఉదాహరణగా చూపిస్తూ, త్రిష తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని తెలిపారు.
అర్చనా అభిప్రాయం ప్రకారం, త్రిష నటించిన అనేక చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అందుకే ఆమెను దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన హీరోయిన్లలో ఒకరిగా భావిస్తారని చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా త్రిష, విజయ్, అజిత్ కుమార్, సూర్య, కమల్ హాసన్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించారు. తరాలు మారినా, ప్రేక్షకుల అభిరుచులు మారినా ఆమె తన క్రేజ్‌ను నిలబెట్టుకోవడం విశేషం.