
28 ఏళ్లపాటు తృణమూల్‌పై తిరుగులేని పట్టు సాగించిన అధినేత్రి మమతా బెనర్జీ తొలిసారి మేనల్లుడి కారణంగా అస్థిత్వ పోరాటం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో ప్రస్తుత సంక్షోభానికి కేంద్ర బిందువు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. పార్టీలోని చాలా మంది నాయకులు అతని పనితీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా మమతా బెనర్జీని తాము గౌరవిస్తున్నామని చెబుతూ.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ నాయకత్వాన్ని మాత్రం ఒప్పకోమని కరాఖండిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మేనల్లుడి విషయంలో దీదీ రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఆసక్తికరం. 2014 నుంచి మమతా బెనర్జీ తన వారసుడిగా అభిషేక్‌ను తయారుచేసే పనిలో ఉన్నారు. పార్టీలోని కీలక బాధ్యతలను ఆయనకే అప్పగించారు. కార్పొరేట్, యువ విభాగాలను కూడా అభిషేకే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమైన నిర్ణయాలనూ తీసుకుంటున్నారు. పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు అభిషేక్ తీరుపై పార్టీలో చాలా మంది సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. సువేందు అధికారి సహా పలు నేతలు పార్టీనీ వీడి వెళ్లడానికి కూడా అభిషేక్ వైఖరే కారణమన్న ఆరోపణలూ ఉన్నాయి. మమత కష్టపడి క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మిస్తే.. అభిషేక్ తృణమూల్‌ను ఐ-పాక్ లాంటి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ఆయనేనని నిందిస్తున్నారు. అభిషేక్ విషయంలో మమతా బెనర్జీ మధ్యే మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. పాత తరం నాయకులను శాంతింపజేస్తూనే, ఆమె మేనల్లుడిని కాపాడుకోవడానికి ప్రయత్నించొచ్చు. ఇప్పటికే ఆమె పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేశారు. దీని ద్వారా అభిషేక్ కార్పొరేట్ శైలి మేనేజ్మెంట్ను పక్కన పెట్టానన్న సంకేతాన్ని పంపించారు. తిరుగుబాటుదారులను వెనక్కి రప్పించడానికి రానున్న రోజుల్లో ఆమె అభిషేక్ అధికారాలకు కోత పెట్టి తానే పార్టీని పర్యవేక్షించొచ్చు. మమతకు సంక్షోభాలు కొత్త కాదు. తృణమూల్ కాంగ్రెస్‌ను ఆమె తన జీవితకాల శ్రమతో నిర్మించారు. దాన్ని కాపాడుకోవడానికి ఆమె
ఎంతకైనా తెగిస్తారన్నది పార్టీలోని సీనియర్ నేతల అభిప్రాయం. ఇందుకోసం అభిషేక్‌ను త్యాగం చేయాల్సి వచ్చినా ఆమె వెనుకాడరన్నది వారు చెబుతున్న మాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని సౌగత్ రాయ్ లాంటి పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం. మమత పుట్టుకతోనే పోరాట యోధురాలని.. ఆమె ఈ సంక్షోభాన్ని అధిగమిస్తారని అంటున్నారు. ఒకవేళ విఫలమైతే మాత్రం బెంగాల్లో వామపక్షాలకు పట్టిన గతే.. తృణమూల్కూ పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎదుర్కొంటున్న సంక్షోభం ఇప్పుడు పార్లమెంటుకూ పాకే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు భాజపాతో టచ్‌లో ఉన్నారని, వారు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని వార్తా కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం ఉభయ సభల్లో (లోక్‌సభలో 28, రాజ్యసభలో 13) టీఎంసీకి మొత్తం 41 మంది ఎంపీలు ఉన్నారు. బెంగాల్ శాసనసభలో ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారు. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని 58 మందికి పైగా తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం తామే నిజమైన తృణమూల్ అని ప్రకటించుకుంది. రాబోయే రోజుల్లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు కూడా విడిపోతే తిరుగుబాటు వర్గం మరింత బలంగా మారుతుంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలకు జరిగినట్లే.. మమతా బెనర్జీ కూడా తన పార్టీ పేరును, జోడు పువ్వుల గుర్తును కోల్పోయే ప్రమాదం ఉంది.
మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల స్వరంలో మార్పు కనిపిస్తోంది. తాము విడిపోయి ఒక గ్రూపుగా ఏర్పడినా దీదీయే తమ నాయకురాలంటున్నారు. మమతా బెనర్జీ తమకు సలహాదారుగా వ్యవహరించొచ్చంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందానికి నేతృత్వం వహించిన రితుబ్రత బెనర్జీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. దీదీని సలహదారు పాత్రకు పరిమితం చేయడం తమకు ఇష్టం లేదన్న సంకేతాలు పంపిస్తున్నారు. ఒక వేళ ఆమెను సలహాదారు పాత్రకు పరిమితం చేస్తే తిరిగి సొంతగూటికి వెళ్లిపోతామన్న బెదిరింపులు కూడా కొందరు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాము పార్టీలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న అభిషేక్ బెనర్జీని వ్యతిరేకిస్తున్నాం గానీ.. మమతను కాదని తిరుగుబాటు చేసిన వర్గంలోని మెజారీటీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ‘‘మమతా బెనర్జీ మా సుప్రీం నేత. ఆమె కొనసాగుతారు.ఆమె సలహాదారు కాదు’’ అని తిరుగుబాటు చేసిన బృందంలోని ఎమ్మెల్యే సంగీతా రాయ్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.