Minor Income Tax Rules: భారత్ సహా ప్రపంచ క్రికెట్లో ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల వయసులోనే క్రికెట్లోని పలు రికార్డుల్ని ఈజీగా చెరిపేస్తున్నాడు. వయసుకు.. ఆటకు సంబంధం లేదని నిరూపిస్తున్నాడు. మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సర్లు బాదుతుంటే.. బౌలర్లు చేసేదేం లేదని నిట్టూరుస్తున్నారు. బుమ్రా, హేజిల్ వుడ్, రబాడా, భువనేశ్వర్, ఎంగిడి, మార్కో యాన్సెన్, స్టార్క్ ఇలా ఎవ్వరినీ వదలకుండా వారికి చుక్కలు చూపించాడని చెప్పొచ్చు. 2025లో తన తొలి ఐపీఎల్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్.. ఈ ఏడాది ఐపీఎల్లో మరింత చెలరేగి 16 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 776 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇందులో ఏకంగా 72 సిక్సర్లు ఉండటం విశేషం. ఒకే సీజన్లో ఇన్ని సిక్సర్లు ఎవరూ బాదలేదు. స్ట్రైక్ రేట్ 237.31 కాగా.. యావరేజ్ 48.50 గా ఉంది. ఆరెంజ్ క్యాప్ ఒక్కటే కాదు.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్టైకర్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డులన్నీ దక్కించుకున్నాడు.ఇదిలా ఉంటే.. తన ఆటతో యావత్ ప్రపంచం ఫిదా అయిపోయింది. దీంతో మనోడికి పెద్ద పెద్ద కంపెనీలు.. యాడ్స్ కోసం వైభవ్ దగ్గర క్యూ కడుతున్నాయి. దీంతో ఐపీఎల్ కాంట్రాక్టులు సహా ఇతర ఎండార్స్మెంట్స్, స్పాన్సర్ షిప్ డీల్స్ ద్వారా కోట్లు ఆర్జిస్తున్నాడు. దీంతో 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ రూ. 7 కోట్ల నికర సంపదను ఆర్జించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే ఆదాయం ఇప్పుడు చర్చకు దారితీసింది. మైనర్ అయిన వైభవ్ సూర్యవంశీ.. ఈ ఆదాయంపై టాక్స్ కట్టాలా.. అతడికి రూల్స్ ఎలా వర్తిస్తాయి.. అనేది తెలుసుకుందాం.మైనర్ సంపాదన.. పేరెంట్స్ ఆదాయం కిందికే.! సాధారణంగా భారత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం.. 18 ఏళ్ల లోపు వ్యక్తిని మైనర్‌గా పరిగణిస్తారు. సాధారణంగా
మైనర్ సంపాదించే ఆదాయం చాలా సందర్భాల్లో తల్లిదండ్రుల ఆదాయంలోనే కలుపుతారు. దీనిని క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కంగా పిలుస్తారు. ముఖ్యంగా బ్యాంక్ నుంచి సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీలు, పెట్టుబడులపై వచ్చే రాబడులు, పేరెంట్స్ బదిలీ చేసిన ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం దీని పరిధిలోకి వస్తుంది. వైభవ్ విషయంలో వేరే.. కానీ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విషయంలో ఈ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వైభవ్ ఆదాయం.. తన వ్యక్తిగత ప్రతిభ, సామర్థ్యం, క్రీడా నైపుణ్యం వల్ల వస్తుంది. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఫీజులు సహా బ్రాండ్ ప్రచారాలు, ఐపీఎల్ కాంట్రాక్ట్స్, స్పాన్సర్ డీల్స్ ఆదాయాలు అన్నీ తన సొంతంగా ఆర్జించినవిగానే పరిగణించాల్సి ఉంటుంది. అందుకే.. అతడి ఆదాయాన్ని తన పేరెంట్స్ ఆదాయంలో కలపరు. వైభవ్ పేరిటే ఐటీఆర్ ఫైల్ చేయాలి.. కాబట్టి ఇక్కడ వైభవ్ సంపాదనకు సంబంధించి అతడికే హక్కు ఉంటుంది. అంటే అతడు మాత్రమే టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ అవసరమైతే.. అతని తరఫున తన తల్లిదండ్రులు, చట్టబద్ధ సంరక్షకులు ఎవరైనా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి వృత్తి పర లేదా కమర్షియల్ ఆదాయాల్ని.. వ్యాపారం లేదా వృత్తి ఆదాయం కింద పరిగణించి సదరు ఐటీఆర్ ఫారంల (ఐటీఆర్ 3 లేదా 4 ఫారం) ద్వారా రిపోర్ట్ చేస్తారు. క్రికెటర్లకు ఒక్కరికే కాదు.. ఆదాయపు పన్ను చట్టంలో ఈ నిబంధన క్రికెటర్లకు మాత్రమే కాదు.. ఇతర చైల్డ్ ఆర్టిస్టులు, యాక్టర్లు, బాల గాయకులు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, రియాల్టీ షో విన్నర్స్, ఇతర క్రీడాకారులు తమ సొంత ప్రతిభ ద్వారా అంటే వ్యక్తిగతంగా ఆదాయం పొందితే ఇదే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇలా ఆర్జించే వారు మనకు చాలా మందే కనిపిస్తుంటారు. ఎంత టాక్స్ పే చేయాలి మరి..? టాక్స్ ఎక్స్పర్ట్స్ ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ ఆర్జిస్తున్న కోట్లాది రూపాయల ఆదాయం.. తన సొంత క్రికెట్ ప్రతిభ కారణంగానే కాబట్టి అది పూర్తిగా అతని సొంత లేదా వ్యక్తిగత ఆదాయం కిందికే వస్తుంది. అప్పుడు భారత పన్ను చట్టాల ప్రకారం.. అతను మైనర్ అయినా.. పన్ను పరంగా స్వతంత్ర పన్ను చెల్లింపుదారుగా వ్యవహరించాల్సి ఉంటుంది. పన్ను చట్టంలోని శ్లాబుల ఆధారంగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తన ఆదాయంపై 30 శాతం వరకు టాక్స్ పడుతుందన్నమాట.