సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే అమరావతి ఐ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. అంతర్జాతీయ హంగులతో అమరావతిని నిర్మించేందుకు ప్రణాళికలు చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఆలోచనే అమరావతి ఐ (Amaravati EYE). లండన్ ఐ తరహాలోనే అమరావతిలో కృష్ణా నది ఒడ్డున అమరావతి ఐ నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం అనేక కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనేకృష్ణా నదీ తీరంలో ‘అమరావతి ఐ’ ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లు పిలిచేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఏంటీ లండన్ ఐ..?లండన్ ఐ అనేది.. ఐరోపాలోనే అత్యంత ఎత్తైన కాంటిలెవర్డ్ అబ్జర్వేషన్ వీల్.. దీనిని థేమ్స్ నది ఒడ్డున నిర్మించారు. 443 అడుగులు (135 మీటర్లు) ఎత్తులో లండన్ ఐ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ హౌస్, బిగ్ బెన్ ఎదురుగా ఈ లండన్ ఐ ఉంటుంది. సెకనుకు 26 సెంటీమీటర్ల చొప్పున ఈ వీల్ నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. లండన్ ఐ ఒక భ్రమణం పూర్తి చేసేందుకు 30 నిమిషాలు సమయం పడుతుంది. ఇక ఇందులో కూర్చున్న రైడర్లు 360 డిగ్రీల కోణంలో చుట్టుపక్కల అందాలను వీక్షించవచ్చు. యూకేలోని ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఈ లండన్ ఐ నిలుస్తోంది. దీని తరహాలోనే అమరావతిలో కృష్ణా నది ఒడ్డున అమరావతి ఐ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలుమరోవైపు ఏపీ కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ-2025 ముసాయిదాకు, ఏపీ ఏవియేషన్ పాలసీ -2026కు ఆమోదం తెలిపింది. అమరావతిలో క్వాంటం వ్యాలీకి కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించాలని నిర్ణయించారు. విశాఖపట్నం. చీరాల బీచ్‌లలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడం కోసం ఎక్సైజీ పాలసీ మార్గదర్శకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఏపీలో వీబీజీ-రాంజీ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటుగా గురుకులాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.