
ఏళ్లకు ఏళ్లు చకోర పక్షిలా నిరీక్షణ తప్పలేదు నిరుడు గెలిచినా.. తొక్కిసలాట ఘటన మిగిల్చిన చేదు అనుభవం తప్పలేదు.. 17 ఏళ్ల తర్వాత గతేడాది తొలిసారి టైటిల్ దక్కినా.. తనివితీరా సంబరాలు చేసుకోలేని పరిస్థితి! ఆ లోటును పూడ్చుకోవడం కోసమేనా అన్నట్లు ఆ జట్టు మరోసారి ఐపీఎల్ కప్పును ముద్దాడింది తమ విజయం గాలి వాటం కాదని.. అది తమ ఆటగాళ్ల ప్రజ్ఞాపాటవాలకు నిదర్శనమని.. నలు చెరుగులా చాటి చెప్పింది.. ఆ జట్టే.. ఆర్సీబీ.. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. ప్లేఆఫ్స్‌నకు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అలాగే, క్వాలిఫయర్ -1లో గుజరాత్ టైటాన్స్‌పై పైచేయి సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో అదే జట్టును మరోసారి మట్టికరిపించి.. అ‘ద్వితీయం’గా కప్పును సొంతం చేసుకుంది. ఆర్సీబీ జట్టు కూర్పు అదిరిపోయింది. బ్యాటర్లు, బౌలర్ల సమతూకంగా ఉంది. విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటీదార్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య ఇలా.. ఏడో స్థానం వరకు లోతైన బ్యాటింగ్ లైనప్ ఉంది. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, రొమారియో షెఫర్డ్, రసిఖ్ సలామ్ దార్.. ఇలా బౌలింగ్ దళమూ భేష్‌గా ఉంది. కృనాల్ పాండ్య రూపంలో చక్కటి ఆల్‌రౌండర్ కూడా ఉన్నాడు. దీంతో ఆ జట్టు కూర్పు అద్భుతంగా కుదిరింది. అందుకే ఫిల్ సాల్ట్ లాంటి స్టార్ బ్యాటర్ గాయంతో దూరమైనా.. ఆ ప్రభావం జట్టుపై పడలేదు. ఈ సీజన్లో ఆర్సీబీ తమ హోం గ్రౌండైన చిన్నస్వామి స్టేడియంలో లీగ్ స్టేజిలో కేవలం అయిదు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. మిగతా రెండు మ్యాచ్‌లను రాయ్‌పుర్‌లో ఆడింది. అయినప్పటికీ మెరుగ్గా రాణించి ఫ్లేఆఫ్స్‌నకు చేరుకున్న తొలి
జట్టుగా నిలిచింది. ఈ సీజన్లో వారు కేవలం 5 మ్యాచుల్లోనే ఓటమి పాలయ్యారు. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన ఆర్సీబీ సంప్రదాయం ప్రకారం నిజానికి ఫైనల్ మ్యాచ్ తమ హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఆడాలి. కానీ.. కొన్ని కారణాల వల్ల ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడాల్సి వచ్చింది. అయినా.. ఏమాత్రం తడబాటుకు గురికాకుండా.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇలా వరుసగా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుని చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ సరసన నిలిచింది.
ఈ విజయంలో తెర వెనక కోచ్‌ల పాత్ర కూడా ఉంది. బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, బౌలింగ్ కోచ్ ఓంకార్ సల్వి తెర వెనకుండి జట్టును ఏకతాటిపై ముందుకు నడిపించారు. వారి వ్యూహాలే ఆర్సీబీకి మరోసారి కప్పును అందించాయనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మే 22న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చవిచూసినా.. నెట్ రన్‌రేట్ తగ్గకుండా చూసుకుని పాయింట్ల పట్టికలో మొదటి స్థానం చేజారకుండా జాగ్రత్త పడ్డారు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఏ దశలోనూ విజయం కోసం చూడలేదు! ఒకవేళ విజయం కోసం ఆడి ఉంటే 170 పరుగుల లోపే ఆలౌటై ఉండేదేమో! కానీ, వ్యూహాత్మకంగా ఆ జట్టు నెట్‌రన్‌రేట్‌లో మెరుగ్గా ఉండేలా ఆడింది. ఈ మైండ్ గేమ్‌లో ఆటగాళ్లు పాత్రధారులైతే.. తెర వెనకున్న ఈ కోచ్‌లే అసలైన సూత్రధారులు.
‘ఫైనల్’ టచ్..: వారి ప్రయాణం ఈ రెండు కప్పులతోనే ఆగేలా లేదు! ఐపీఎల్ 20 సీజన్ పైనా వారు కన్నేశారు! ఆర్సీబీ భవిష్యత్తు ప్రణాళిక.. ముచ్చటగా మూడోసారి కప్పును కైవసం చేసుకోవడమే! ‘ఈసారి కప్పు మనదే’ అనేది వారికి ఇకపై పాత నినాదం! ‘ప్రతి సారీ కప్పు మనదే’ అనేదే వారి కొత్త విధానం!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తన బౌలింగ్‌లో స్విచ్ హిట్‌తో సిక్సర్ కొడితే చాలా కోపమొచ్చేదని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చెప్పాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ టీమ్ సంబరాలు చేసుకుంది.
ఐపీఎల్-19 ఫైనల్లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ వేసిన ఇన్సింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి విరాట్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. శుభ్‌మన్ గిల్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు.
విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్-19 ఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. విన్నింగ్ షాట్ వీడియో మీరూ చూడండి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
© 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.