
Watch : క్రికెట్ మైదానంలో అభిమానులు తమకు నచ్చిన స్టార్ ఆటగాళ్లను కలవడానికి భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి రావడం మనం తరచూ చూస్తుంటాం. సాధారణంగా వారు
ఆటగాళ్లను హగ్ చేసుకోవడానికో లేదా పాదాభివందనం చేయడానికో ప్రయత్నిస్తారు. కానీ అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న శపగీజా క్రికెట్ లీగ్ 2026లో మాత్రం ఒక నమ్మశక్యం కాని వింత ఘటన జరిగింది. ఒక క్రేజీ అభిమాని మైదానంలోకి దూసుకువచ్చి, అఫ్గాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రెహమానుల్లా గుర్బాజ్ తలపై ఉన్న క్యాప్‌ను దొంగిలించి పారిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
శుక్రవారం బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్, మిస్ ఐనక్ నైట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మొదటి ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో రెహమానుల్లా గుర్బాజ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. అప్పుడు ఒక అభిమాని హఠాత్తుగా భద్రతా సిబ్బందిని దాటుకుని మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గుర్బాజ్ అతడిని చూసి ఎంతో స్పోర్టివ్‌గా హ్యాండ్‌షేక్ ఇవ్వడానికి చేయి చాచాడు. అయితే ఆ ఫ్యాన్ మాత్రం గుర్బాజ్ ఊహించని విధంగా.. మెరుపు వేగంతో గుర్బాజ్ తలపై ఉన్న క్యాప్‌ను లాక్కుని, స్టేడియం వెలుపలికి పరుగు లంకించుకున్నాడు. సెక్యూరిటీ గార్డ్స్ అతడిని పట్టుకోవడానికి వెనకాలే పరిగెత్తినా లాభం లేకపోయింది.
ఈ మ్యాచ్‌లో మిస్ ఐనక్ నైట్స్ జట్టుకు రెహమానుల్లా గుర్బాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ జట్టు, ప్రత్యర్థి బౌలర్ల ధాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. డ్రాగన్స్ జట్టులో అజీజుల్లా మియాఖిల్ అత్యధికంగా 30 పరుగులు చేయగా, ఫర్మనుల్లా 20 పరుగులు జోడించాడు. మిస్ ఐనక్ నైట్స్ బౌలర్లలో జియార్ రెహమాన్ కేవలం 12 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్ కూడా 3 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు.
A pitch invader runs into @RGurbaz_21 on the field during today’s #Shpageeza match only to grab his cap before making a quick exit. #ACA #AfghanistanCricket — Bashir Gharwal غروال (@bashir_gharwall) July 3, 2026 అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మిస్ ఐనక్ నైట్స్ జట్టు కేవలం 10 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించేసింది. ఓపెనర్ ఖాలిద్ తనివాల్ కేవలం 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. మరోవైపు కెప్టెన్ రెహమానుల్లా గుర్బాజ్ కూడా తనేమీ తక్కువ కాదన్నట్లు 30 బంతుల్లో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు కేవలం 51 బంతుల్లోనే 102 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.
ఈ విజయంతో టోర్నమెంట్లో మిస్ ఐనక్ నైట్స్ జట్టు తమ మొదటి గెలుపును నమోదు చేసింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, తాజా గెలుపుతో ఆ జట్టు మొత్తం 3 పాయింట్లతో పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకుంది. మరోవైపు బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ జట్టు పరిస్థితి ఈ లీగ్‌లో మరీ దారుణంగా మారింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా ఓటమి పాలు కావడంతో ఆ జట్టు టోర్నీలో వెనుకబడిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి