కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు దేశ, విదేశాల నుంచి వస్తుంటారు. భక్తులు బస్సులు, సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకుంటారు.
కొందరు భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో నడుచుకుంటూ తిరుమలకు వెళతారు. రెండు నడక మార్గాల్లో మెట్లపై నుంచి నడుచుకుంటూ కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇలా మెట్ల మార్గంలో నడవలేరు.. యువత కూడా మెట్లు ఎక్కుతూ మధ్య, మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటారు. అలాంటిది ఓ 116 బామ్మ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి నడక మార్గంలో కొండకు వెళ్లారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది. 116 ఏళ్ల వయసులో ఈ బామ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన తిరుమల మెట్లు ఎక్కడాన్ని చూసిన మరో భక్తురాలు వారిని పలకరించారు. ఆమె ఈ వయసులో కాలినడకన తిరుమలకు వెళ్లడం నిజంగా అసాధారణం, స్ఫూర్తిదాయకం అంటున్నారు. ప్రస్తుతం యువత తిరుమల కొండకు నడక మార్గంలో వెళ్లడం భారంగా భావిస్తుంటే.. ఈ బామ్మ వయసును సైతం లెక్కచేయకుండా వెంకన్న దర్శనానికి వచ్చారు. ఆమె మనోబలం, అచంచలమైన దైవభక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 'ఇది కేవలం శారీరక దృఢత్వమే కాదు, నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించే అద్భుత దృశ్యం' ఈ వీడియోను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ చేస్తున్నారు. ఈ బామ్మ తమిళనాడు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.టీటీడీ పవిత్ర దీపపూజజూలై 10వ తేదీ సాయంత్రం చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్ర దీపపూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ జేఈవో డా ఏ శరత్ అధికారులను ఆదేశించారు. ఆయన ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. దీపపూజలో పాల్గొనే భక్తుల కోసం తగిన సంఖ్యలో షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు, ఎల్ఈడీ స్క్రీన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను సమృద్ధిగా ఏర్పాటు చేసి, ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు సౌకర్యవంతంగా పాల్గొనేలా చర్యలు చేపట్టాలని జేఈవో సూచించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన జేఈవో వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. జులై 10, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపునిర్వహిస్తారు. జులై 12న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగిభక్తులను కటాక్షిస్తారు. జులై 19న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు మాడ వీధులలో విహరిస్తారు. జులై 17న ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. జులై 22వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు అహోబిలం మఠానికి వేంచేపు చేస్తారు. జులై 24 నుండి 26వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం. జులై 26న తులసీ మహత్యం ఉత్సవం సందర్భంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు. జులై 29న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి గరుడ సేవ నిర్వహిస్తారు.