Ayatollah Khamenei Funeral Tehran : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ వీడ్కోలు కార్యక్రమాలతో రాజధాని టెహ్రాన్ నగరం శోకసంద్రంగా మారింది.
యూఎస్-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల్లో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ సంతాప కార్యక్రమాల్లో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తమ ప్రియతమ నేత అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడాన్ని గుర్తు చేసుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది దేశాల అధినేతలు, విదేశీ ప్రముఖులు, దౌత్య ప్రతినిధులు ఖమేనీ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు తరలివచ్చారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. జూలై 9న అంతిమ సంస్కారాలు..ప్రస్తుతం టెహ్రాన్ గ్రాండ్ మొసల్లాలో ఉంచిన ఖమేనీ భౌతికకాయానికి ప్రజలు, ఆ దేశ అధినేతలతో పాటు విదేశాల నుంచి వచ్చిన నేతలు కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకే ప్రార్థనా మందిరం తలుపులు తెరుచుకోగా.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగానే.. ఖమేనీని చివరి సారి చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. వారిని వారు కంట్రోల్ చేసుకోలేక.. వారు ఏడ్చిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. శని, ఆది వారాలు ప్రజల సందర్శనార్థం ఖమేనీ పార్థివ దేహాన్ని ఇక్కడే ఉంచనుండగా.. సోమవారం టెహ్రాన్ నగరంలో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇరాన్‌లోని పవిత్ర నగరమైన ఖోమ్తో పాటు ఇరాక్‌లోని బాగ్దాద్, కర్బలా, నజాఫ్ నగరాల్లో ప్రత్యేక మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు. చివరగా జూలై 9వ తేదీన మషద్ నగరంలో ఖమేనీ అంతిమ సంస్కారాలు పూర్తి కానున్నాయి. అయితే ఈ అంతిమ వీడ్కోలు కార్యక్రమాల కోసం టెహ్రాన్ గవర్నర్ మొహమ్మద్ సాదెగ్ మొతమదియన్ అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. ఇరాన్ విప్లవ నేత అంతిమయాత్ర ఊరేగింపు దృష్ట్యా ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరాన్ని పూర్తిగా మూసివేయనున్నట్లు బాగ్దాద్ గవర్నర్ అత్వన్ అల్-అత్వాని వెల్లడించారు. ఇరాన్ అధికారుల అంచనా ప్రకారం.. ఈ వారం రోజులు సాగే అంతిమయాత్రలో 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది.భారత్ నుంచి ఎవరెవరు వెళ్లారంటే?ఈ అధికారిక సంతాప వేడుకల్లో భారతదేశం తరఫున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ హాజరై నివాళులు అర్పించారు. వీరితో పాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు ఇరాన్ ఎంబసీ వేదికగా అంజలి ఘటించారు. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ సైతం టెహ్రాన్ చేరుకున్నారు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వేడుకకు పొరుగు దేశాల నుంచి కనీసం 8 మంది ప్రభుత్వ అధినేతలు (అధ్యక్షులు లేదా ప్రధానులు), 12 దేశాల పార్లమెంట్ స్పీకర్లు హాజరు అయ్యారు.వీరిలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఇరాక్ అధ్యక్షుడు నిజార్ అమేది, ఆర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్, తుర్క్మెనిస్థాన్ నేత గుర్బాంగులీ బెర్దిముహమేదోవ్, టర్కీ వైస్ ప్రెసిడెంట్ జెవ్డెట్ యిల్మాజ్ ఉన్నారు. అలాగే సౌదీ అరేబియా, ఒమన్, అజర్బైజాన్, షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ ప్రతినిధులు సైతం విచ్చేశారు. అయితే ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులకు మద్దతు పలికిన యూరప్ దేశాలకు ఇరాన్ ఆహ్వానాలు పంపలేదు.