
ఇంటి అలంకరణతో పాటు గృహంలో సానుకూల శక్తిని పెంపొందించుకోవడానికి వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఐశ్వర్యం, ఆర్థిక వృద్ధి కోసం చాలామంది
తమ ఇళ్లలో మనీ ప్లాంట్‌ను పెంచుకుంటారు. వాస్తు నిపుణుల అభిప్రాయాల ప్రకారం, మనీ ప్లాంట్ కంటే కూడా అద్భుతమైన వాస్తు ఫలితాలను ఇచ్చే మరో మొక్క ఉంది. అదే కాయిన్ ప్లాంట్. ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియడానికి, నిలకడైన ఆర్థిక పురోగతిని సాధించడానికి ఈ మొక్క ఎంతో దోహదపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.రూపంలోనూ, ఎదుగుదల శైలిలోనూ కాయిన్ ప్లాంట్ మనీ ప్లాంట్ కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. మనీ ప్లాంట్ పెరగడానికి వీలుగా ఏదైనా గోడ లేదా తీగ వంటి ఆధారం అవసరమవుతుంది. కాయిన్ ప్లాంట్ చిన్నగా, దృఢంగా, నేరుగా నిలబడి అందమైన ఆకృతిలో పెరుగుతుంది. దీని ఆకులు గుండ్రంగా, కాంతివంతంగా ఉండి సరిగ్గా నాణేల (కాయిన్స్) మాదిరిగా కనిపిస్తాయి. ఈ ఆకర్షణీయ రూపమే దీనికి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. వాస్తు ప్రకారం, దీని స్థిరమైన ఎదుగుదల ఇంట్లోని సానుకూల శక్తిని బలోపేతం చేస్తుంది.కాయిన్ ప్లాంట్ ఎలా సహాయపడుతుంది?సాధారణంగా మనీ ప్లాంట్ తీగలా పైకి పాకుతూ పోయినట్లే సంపద కూడా పెరుగుతుందని నమ్ముతారు. డబ్బు సంపాదనకు బలమైన అవకాశాలు ఏర్పడటం ఒక్కటే కాకుండా వచ్చిన ధనాన్ని ఎంత పొదుపుగా వాడుతున్నామనేది కూడా ముఖ్యం. కాయిన్ ప్లాంట్ ను వాస్తు శాస్త్రంలో ఐశ్వర్య స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఇది లక్ష్మీదేవి కటాక్షాన్ని ఇంటి వైపు ఆకర్షించేలా చేయడమే కాకుండా, అనవసరమైన ఖర్చులను అదుపు చేసి, సంపాదించిన డబ్బు నిలకడగా ఉండేలా చేస్తుందని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు. కుటుంబంలో పొదుపు అలవాట్లను ప్రోత్సహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.కాయిన్ ప్లాంట్ వల్ల ఇటువంటి వాస్తు ప్రయోజనాలతో పాటు శారీరక, మానసిక ఉపశమనం కూడా లభిస్తుంది. దీని మెరిసే పచ్చటి ఆకులు ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని సంగ్రహిస్తాయి. తద్వారా నెగెటివిటీని పోగొట్టినట్టవుతుంది. ప్రశాంత వాతావరణాన్ని ఇంట్లో సృష్టించినట్టవుతుంది. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో మొక్కల సంరక్షణకు సమయం కేటాయించలేని వారికి ఇది చక్కని ఎంపిక. ఎందుకంటే మనీ ప్లాంట్‌తో పోలిస్తే దీనికి చాలా తక్కువ నిర్వహణ అవసరమవుతుంది. తక్కువ నీరు, పరిమితమైన వెలుతురులో కూడా ఈ మొక్క ఎంతో పచ్చగా కళకళలాడుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య మానసిక ఒత్తిడి తగ్గి, పరస్పర సత్సంబంధాలు మెరుగవుతాయి.వాస్తు ప్రకారం కాయిన్ ప్లాంట్‌ను ఎక్కడ ఉంచాలి?ఏదైనా ఒక మొక్క నుండి పూర్తిస్థాయిలో వాస్తు ఫలితాలు పొందాలంటే దానిని సరైన దిశలో ఉంచడం ఎంతో ముఖ్యం. వాస్తు రూల్స్ ప్రకారం, కాయిన్ ప్లాంట్‌ను ఇళ్లలో ఉత్తరం లేదా తూర్పు దిశలో అమర్చడం అత్యంత శుభప్రదం. ఉత్తర దిశను.. ఐశ్వర్య ప్రదాత, ధనాధిపతి అయిన కుబేరుడి స్థానంగా భావిస్తారు. కాబట్టి, అక్కడ ఈ మొక్కను ఉంచడం వల్ల నూతన ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. ఈ మొక్కను ఎట్టిపరిస్థితుల్లోనూ చీకటి మూలల్లో లేదా అసలు గాలి, వెలుతురు సోకని ప్రదేశాల్లో ఉంచకూడదు.సహజమైన పచ్చదనం మన మనస్సుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా, ఇంట్లోని గాలిని కూడా శుద్ధి చేస్తుంది. అందమైన రూపంతో పాటు చక్కని వాస్తు ప్రయోజనాలు అందించే కాయిన్ ప్లాంట్ నేటి తరం గృహాలంకరణకు ఎంతో సరిపోతుంది. తక్కువ ఖర్చుతో కూడిన సులభమైన పెంపకంతో గృహంలో సుఖశాంతులను, ఆర్థిక భద్రతను పెంపొందించుకోవాలనుకునే వారికి కాయిన్ ప్లాంట్ ఎల్లప్పుడూ ఒక ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.