
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.. పెళ్లింట విషాదం బ్రేకు, క్లచ్ మధ్య ఇరుక్కున్న కొబ్బరిబొండం విజయవాడ(చిట్టినగర్), న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి పరిధి విజయవాడ బైపాస్‌లో జరిగిన...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.. పెళ్లింట విషాదం
బ్రేకు, క్లచ్ మధ్య ఇరుక్కున్న కొబ్బరిబొండం
విజయవాడ(చిట్టినగర్), న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి పరిధి విజయవాడ బైపాస్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మరణించారు. పురోహితుడితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కారు బ్రేకు, క్లచ్ మధ్య ఓ కొబ్బరిబొండం ఇరుక్కుపోవడం ఈ ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు చెబుతున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన దువ్వూరి హరిప్రసాద్(52) పురోహితుడు. ఆయన చిన్న కుమారుడి వివాహం హైదరాబాద్‌లో గురువారం పెళ్లికుమార్తె ఇంటివద్ద జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులు ఒక కారులో, హరిప్రసాద్ ఆయన బంధువు, వెనుక సీట్లో పూజసామగ్రితో మరో కారులో రాజమహేంద్రవరం బయలుదేరారు. విజయవాడ సమీపంలోని నల్లగుంట వద్ద ఆయన బంధువు కారు దిగిపోయారు. గొల్లపూడి బైపాస్ రోడ్డు సమీపంలో కారు అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని, అక్కడే ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొట్టింది. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టినప్పుడు కారు వెనకసీట్లో ఉన్న కొబ్బరిబొండం ఎగిరివచ్చి బ్రేక్, క్లచ్ మధ్య ఇరుక్కోవడంతో కారు అదుపుకాలేదని, అందుకే కంటెయినర్‌ను ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. కారు నడుపుతున్న హరిప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు.
విజయవాడ రాజీవ్‌నగర్‌కు చెందిన సూరిబోయిన గురవయ్య(60) మార్కాపురం జిల్లా చందశ్రేఖరపురం మండలం బోయమడుగుల వీఆర్ఏ. అనారోగ్యం కారణంగా గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శుక్రవారం వైద్యం చేయించుకున్నారు. అక్కడనుంచి తన కుమారుడు హరికృష్ణ ద్విచక్రవాహనంపై విజయవాడ బయలుదేరారు. వాహనం వెనక సీట్లో గురవయ్య కూర్చున్నారు. కారు ఢీకొట్టగానే గురవయ్య ఎగిరి రోడ్డుమీద పడి అక్కడికక్కడే మృతిచెందారు. కుమారుడు శిరస్త్రాణం ధరించడంతో గాయాలతో బయటపడ్డాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.