
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను తప్పుదారిలో తీసుకెళ్లిన సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్‌రెడ్డిని ఉన్నతాధికారులు వీఆర్‌కు అటాచ్ చేశారు.
కోదాడ రూరల్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను తప్పుదారిలో తీసుకెళ్లిన సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్‌రెడ్డిని ఉన్నతాధికారులు వీఆర్‌కు అటాచ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి ఈ నెల ఒకటోతేదీ రాత్రి తన నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి కోదాడ మీదుగా వెళ్లాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన డిప్యూటీ సీఎం కాన్వాయ్ కోదాడ బైపాస్ మీదుగా దుర్గాపురం స్టేజీ దగ్గర ఉన్న ఖమ్మం బైపాస్ నుంచి నేలకొండపల్లి మీదుగా వల్లభికి వెళ్లాల్సి ఉంది. కాన్వాయ్‌ను వల్లభికి చేర్చే బాధ్యతను ఉన్నతాధికారులు కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్‌రెడ్డికి అప్పగించారు. డిప్యూటీ సీఎం కాన్వాయ్ రాత్రి 9గంటలకు కోదాడ బైపాస్ వద్దకు చేరుకోగా.. గోపాల్‌రెడ్డి కాన్వాయ్‌ను అనంతగిరి మండలం తమ్మరబండపాలెం మీదుగా డొంక దారిన తీసుకువెళ్లారు. తమ్మరబండపాలెం శివారులోకి వెళ్లగానే రహదారి లేకపోవడంతో కాన్వాయ్ ఆగిపోయింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం.. ఐజీ, డీజీపీలకు అక్కడి నుంచే ఫోన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి.. కొండపల్లి నుంచి వల్లభి గ్రామం వైపు కాన్వాయ్‌ను పంపించారు. మొత్తంగా 20 నిమిషాలకు పైగా డిప్యూటీ సీఎం సంఘటనా స్థలంలో ఉండిపోయారు. ఈ ఘటనపై విచారణ చేసిన ఎస్పీ కొత్తపల్లి నర్సింహ.. కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్‌రెడ్డిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులను గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్దకు వెళ్లి జరిగిన తప్పిదంపై వివరణ ఇచ్చారు.