తిరుమల శ్రీవారి లడ్డూ.. వెంకన్న భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే తిరుమల శ్రీవారి దర్శనం కోసం కొండకు వచ్చే భక్తులు..
స్వామివారి దర్శనం పూర్తైన తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల లడ్డూ ను స్వీకరిస్తారు. క్యూలైన్లలో వేచి ఉండి మరీ.. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పొందుతుంటారు. తిరుపతి లడ్డూను స్వీకరిస్తే.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పుణ్యం కలుగుతుందనే భక్తుల విశ్వాసంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏటికేడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న విధంగానే.. స్వామివారి లడ్డూ ప్రసాదానికి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే 2026 జూన్ నెలలో తిరుమల లడ్డూ విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ నేపథ్యంలో లడ్డూ ఉత్పత్తిని పెంచినట్లు తెలిపింది. 2026 ఏప్రిల్ నెలలో 1,11,96,170 తిరుపతి లడ్డూలను టీటీడీ విక్రయించింది. మే నెలకు వచ్చే సరికి తిరుమల లడ్డూల విక్రయాలు1,21,35,528కు చేరాయి. ఇక జూన్ నెలలో ఏకంగా 1,26,81,805 లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. గత మూడు ఏళ్లతో పోలిస్తే జూన్ నెలలో లడ్డూల విక్రయాలు భారీగా పెరిగినట్లు తెలిపింది. 2024 జూన్‌లో 1,02,64,364 లడ్డూలను, 2025 జూన్ మాసంలో 1,19,21,353 లడ్డూలను విక్రయిస్తే.. 2026 జూన్‌లో 1,26,81,805 లడ్డూలు విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. 2025 జూన్‌తో పోలిస్తే 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయించామని.. 6.37 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. 2024తో పోలిస్తే 24,17,441 లడ్డూలు అధికంగా,, 23.55 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీలో సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలందిస్తున్నట్లు వెల్లడించింది.టీటీడీకి తమిళనాడు కంపెనీ విరాళంతిరుమల శ్రీవారికి భారీ విరాళం వచ్చింది. తమిళనాడుకు చెందిన కేకేఎస్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ శుక్రవారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50.20 లక్షలు విరాళంగా అందజేసింది. సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. అలాగే చిత్తూరుకు చెందిన సురేష్ కుమార్ అనే భక్తుడు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్‌ను కలిసి విరాళం అందజేశారు.