
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో కీలక అడుగు వేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరో కీలక అడుగు వేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఈడీ స్వాధీనం చేసుకున్న ఓ ప్రైవేట్ చార్టర్డ్ విమానాన్ని పూర్తిగా ఈ-వేలం (E-Auction) ద్వారా విజయవంతంగా విక్రయించింది. హైదరాబాద్ జోనల్ ఈడీ పరిధిలో జరిగిన ఈ వేలం దేశంలో ఆస్తుల స్వాధీనం.. విక్రయ ప్రక్రియలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను పారదర్శకంగా విక్రయించి.. ఆ డబ్బును బాధితులకు తిరిగి చెల్లించే దిశగా ఈ చర్య కీలక మైలురాయిగా అధికారులు పేర్కొంటున్నారు.రూ.3 కోట్లకు అమ్ముడైన చార్టర్డ్ విమానం.. ఫాల్కన్ పోంజీ స్కామ్‌లో భాగంగా ఈడీ స్వాధీనం చేసుకున్న హాకర్ 800A (Hawker 800A) చార్టర్డ్ విమానం ఈ-వేలంలో రూ.3 కోట్లకు అమ్ముడైంది. ఈ ప్రైవేట్ జెట్ మార్కెట్ విలువ సుమారు రూ.14 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. అయితే విమానం వయస్సు, నిర్వహణ ఖర్చులు, సాంకేతిక పరిస్థితి, లీగల్ ప్రక్రియలు వంటి అంశాల నేపథ్యంలో వేలంలో రూ.3 కోట్ల ధరకు విక్రయమైంది.ఎంఎస్‌టీసీ ద్వారా ఈ-ఆక్షన్.. ఈడీ అధికారులు జూలై 1, 2026న ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ (MSTC) ఈ-ఆక్షన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వేలం నిర్వహించారు. ఈ ప్రక్రియకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద పనిచేసే అడ్జుడికేటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి లభించిన తర్వాతే వేలం నిర్వహించారు. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ వేలం పారదర్శకంగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు.బాధిత పెట్టుబడిదారులకే వేలం సొమ్ము.. ఈ విమానం విక్రయం ద్వారా వచ్చిన రూ.3 కోట్ల మొత్తాన్ని ఫాల్కన్ పోంజీ స్కామ్‌లో మోసపోయిన బాధిత పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. అక్రమంగా సంపాదించిన ఆస్తులను విక్రయించి, బాధితులకు నష్టపరిహారం అందించే ప్రక్రియలో ఇది కీలక చర్యగా భావిస్తున్నారు.శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్వాధీనం..ఈ చార్టర్డ్ విమానం ఫాల్కన్ పోంజీ స్కామ్ ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్కు చెందినదిగా దర్యాప్తులో తేలింది. కేసు విచారణలో భాగంగా 2025 మార్చి 7న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA), శంషాబాద్లో ఈడీ అధికారులు విమానాన్ని అటాచ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి ఈ-వేలానికి తీసుకువచ్చారు.కాగా దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, అమర్‌దీప్ కుమార్ మరియు అతని సహచరులు ఫేక్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ (Fake Invoice Discounting) పేరుతో పెట్టుబడిదారులను ఆకర్షించారు. అధిక లాభాలు వస్తాయని నమ్మించి దేశవ్యాప్తంగా వందలాది మంది నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించారు. ఈ విధంగా సుమారు రూ.792 కోట్ల మేర ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఈడీ గుర్తించింది.ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నట్లు నమ్మించిన నిందితులు, వాస్తవానికి నకిలీ ఇన్వాయిస్‌లను ఉపయోగించి కొత్త పెట్టుబడిదారుల నుంచి వచ్చిన డబ్బుతో పాత వారికి చెల్లింపులు చేస్తూ పోంజీ స్కీమ్‌ను నడిపినట్లు దర్యాప్తులో బయటపడింది.ఇప్పటికే ముగ్గురు నిందితుల అరెస్ట్..ఈ భారీ మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్‌తో పాటు మరికొందరి పాత్రపై విచారణ కొనసాగుతోంది. అక్రమంగా సంపాదించిన మరిన్ని ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, విదేశీ లావాదేవీలు, నిధుల మళ్లింపు అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వర్గాలు వెల్లడించాయి.దేశంలోనే తొలి ఈ-వేలం ఎందుకు ప్రత్యేకం?ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తులను గతంలో విక్రయించిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఒక విమానాన్ని పూర్తిగా ఈ-వేలం ద్వారా విక్రయించడం దేశంలో ఇదే తొలిసారి. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు ఎక్కువ మంది బిడ్డర్లకు అవకాశం లభిస్తుంది. పోటీ వాతావరణం ఏర్పడటంతో ప్రభుత్వానికి మెరుగైన ధర లభించే అవకాశమూ ఉంటుంది.