
దోషులను నిర్ధారించి కఠినంగా శిక్షించాలి: హోసబలే అయోధ్య విరాళాల చోరీపై ఆరెస్సెస్ తొలి స్పందన దిల్లీ: అయోధ్యలోని రామ మంది
రం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శుక్రవారం తొలిసారి స్పందించింది. దురదృష్టకరమైన విరాళాల చోరీని అసాధారణ ఘటనగా పరిగణించాలంది. దోషులుగా తేలినవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ‘‘కోట్ల మంది భక్తుల త్యాగాలతో నిర్మితమైన అయోధ్య ఆలయంలో విరాళాల చోరీ ఉదంతం యావత్తు సమాజాన్ని, రామ భక్తుల్ని తీవ్రంగా కలచివేసింది. వారి విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మాకు తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని కలిగించింది’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే పేర్కొన్నారు. నిందితులను గుర్తించి వారికి కఠిన శిక్షలు పడేలా సిట్ దర్యాప్తు కొనసాగాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సూచించారు. దత్తాత్రేయ హోసబలే శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో హిందూ సమాజం సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను ఆసరాగా చేసుకొని హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని అపఖ్యాతిపాలు చేయాలని యత్నించే హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తుల కుట్రల్ని తిప్పికొట్టాలని హోసబలే పిలుపునిచ్చారు.
రామాలయ బాధ్యతలను పర్యవేక్షిస్తోన్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక సమావేశం ఈ నెల 6న జరగనుంది. ఈ భేటీలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.విరాళాల చోరీపై దర్యాప్తు వేగవంతం చేసిన సిట్... గత ఐదేళ్ల కాలంలో ట్రస్ట్ నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీలను మరింత లోతుగా పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.