
బైక్ చేతిలో ఉంటే చాలు.. ఇష్టానుసారం నడుపుతూ రోడ్డుపై హల్ చల్ చేస్తుంటారు కొందరు యువకులు. వారి ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్ లో పెడుతుంటారు. ఎవరైనా రోడ్డుపై బండి నడుపుతారు.
సిగ్నల్ పడితే ఆగుతారు.. వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటే కాస్త నెమ్మదిగా వెళ్తుంటారు. కానీ ఓ వ్యక్తి రోడ్డుపై స్టంట్స్ చేశాడు. రోడ్డు మధ్యలోని డివైడర్‌పై ప్రమాదకరంగా బైక్‌ డ్రైవ్‌ చేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.హైదరాబాద్ మహానగరంలో రోడ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. లక్షలాది మంది నిత్యం అనేక పనుల కోసం రోడ్డుపైకి వస్తుంటారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా రోడ్డుపై వాహనాలు నడపాలని ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తూనే ఉంటారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎక్కడపడితే అక్కడ సైన్ బోర్డులు దర్శనం ఇస్తూనే ఉంటాయి. కానీ కొందరు ఆకతాయిలు మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వారి ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలతోనూ చెలగాటం ఆడుతున్నారు. రోడ్లపై విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కానీ యువతలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి ప్రమాదకరంగా డివైడర్ పై వేగంగా డ్రైవింగ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. దాంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఈ వీడియోను తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో షేర్ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేదు, ట్రాఫిక్ నిబంధనలపై గౌరవం లేదు.. కేవలం డేర్ డెవిల్ విన్యాసాలు మాత్రమే! డివైడర్లు రోడ్లను విభజించడానికి ఏర్పాటు చేసినవి. మీ ద్విచక్ర వాహనాలు ర్యాంప్ వాక్ చేయడానికి కాదు. కొద్ది నిమిషాల సమయం ఆదా చేయడం కోసం ప్రాణాలను పణంగా పెట్టకండి. ఇలాంటి సాహసాలు మిమ్మల్ని గమ్యస్థానానికి కాదు, నేరుగా యమపురికో లేదా హాస్పిటల్ బెడ్‌ కో చేరుస్తాయి. రహదారి భద్రత - ప్రతి ఒక్కరి బాధ్యత! అని ట్వీట్ చేశారు.