
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (పీసీఎస్) విభాగంలో పనిచేస్తున్న భీమ్‌రెడ్డి..
అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో గురువారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. నార్సింగిలో ఆయన ఇల్లు సహా రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కళ్లుచెదిరే రీతిలో ఆస్తులను ఏసీబీ గుర్తించింది. విల్లా, ఇళ్లు, ఫ్లాట్లు, కమర్షియల్ స్పేస్‌లు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ భీమ్‌రెడ్డికి వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన ఇంట్లో భారీ స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, సుమారు రూ.43.06 లక్షల నగదు, దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, 23 విదేశీ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంబాగ్‌లోని వెస్పెల్లా మెడోస్‌లో విల్లా, టెలికాంనగర్‌లో జీప్లస్2 పెంట్‌హౌస్‌తో ఇల్లు, ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో ఒక ఫ్లాట్, మణికొండలో 500 గజాల G+5 కమర్షియల్ కాంప్లెక్స్‌లో వాటా, 3,000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్‌లను గుర్తించారు.
తెల్లాపూర్‌లో రెండు ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 గజాల ప్లాట్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేల్చారు. కర్ణాటకలో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. వేర్వేరు చోట్ల దాదాపు 45 ఎకరాలు ఉన్నట్లు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నాగోల్ కామినేని ఆస్పత్రి సమీపంలో 200 గజాల ప్లాట్, పటాన్చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 గజాల ప్లాట్, పటాన్చెరులో మరో 200 గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో 1,000 గజాల స్థలం, 2 ఎకరాల వ్యవసాయ భూమి, శ్రీరాఘవేంద్ర రాక్‌శాండ్ మినరల్స్‌లో రూ.75 లక్షల పెట్టుబడి, వికారాబాద్ జిల్లాలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. డీఎస్పీ బ్యాంకు ఖాతాల్లో రూ.19.91 లక్షల నిల్వలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.