
వేగంగా పరిగెడుతూ వచ్చి లాంగ్ జంప్ చేసిందామె.. వెంటనే లేచి బోర్డు వైపు చూసింది.. అందులో నమోదైన పాయింట్లు చూసుకొని సంతోషం పట్టలేకపోయింది.. గ్రౌండ్‌లోనే తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంది.
22 ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాని లాంగ్ జంప్ రికార్డును తను బద్దలుకొట్టడమే ఇందుకు కారణం.
వేగంగా పరిగెడుతూ వచ్చి లాంగ్ జంప్ చేసిందామె.. వెంటనే లేచి బోర్డు వైపు చూసింది.. అందులో నమోదైన పాయింట్లు చూసుకొని సంతోషం పట్టలేకపోయింది.. గ్రౌండ్‌లోనే తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంది. 22 ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాని లాంగ్ జంప్ రికార్డును తను బద్దలుకొట్టడమే ఇందుకు కారణం. ఈ ఘనత సాధించింది మరెవరో కాదు.. కేరళకు చెందిన లాంగ్ జంపర్ ఆన్సీ సోజన్. ఇటీవలే భువనేశ్వర్‌లో జరిగిన ‘జాతీయ అంతర్రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్’లో పోటీపడిన ఆమె.. 6.88 మీటర్ల దూరం దూకింది. తద్వారా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అంజూ బాబీ జార్జ్ నమోదు చేసిన 6.83 మీటర్ల రికార్డును అధిగమించింది. ఇలా 22 ఏళ్ల తర్వాత సరికొత్త జాతీయ రికార్డును నమోదు చేసి వార్తల్లో నిలిచింది ఆన్సీ. అంతేకాదు.. ఈ ఏడాది జరగబోయే ఆసియా క్రీడలకూ అర్హత సాధించింది.
కేరళ త్రిస్సూర్‌లోని నట్టిక అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది ఆన్సీ. ఆమె తండ్రి ఆటో డ్రైవర్. తండ్రి ప్రోత్సాహంతో తనకిష్టమైన క్రీడల్లోకి అడుగుపెట్టిన ఆమె.. మొదట స్ప్రింటర్‌గా రాణించింది. కానీ కోచ్ సలహా మేరకు లాంగ్ జంప్ వైపు అడుగులు వేసింది.
‘మా నాన్నకు ఆటలంటే చాలా ఇష్టం. ఆర్థిక కారణాల వల్ల తన అథ్లెటిక్ కలను నెరవేర్చుకోలేకపోయానంటూ తను ఎప్పుడూ నాతో చెబుతుండేవాడు. చిన్నతనం నుంచి నేనూ క్రీడలంటే మక్కువ చూపడంతో నన్ను ఇందులో ప్రోత్సహించాడు. అలా మొదటగా 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందేల్లో పాల్గొన్నా. కానీ కోచ్ ‘నువ్వు లాంగ్ జంప్‌లో మరింత బాగా రాణించగలవు’ అంటూ సలహా ఇచ్చారు. అలా ఈ క్రీడలోకి అడుగుపెట్టా. చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు, తోటి విద్యార్థులు, పీఈటీలు నన్నెంతో ప్రోత్సహించేవారు. ఇంట్లో అమ్మానాన్నలూ నేను క్రీడల్లో రాణించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. నా గెలుపును స్టేడియంలో ప్రత్యక్షంగా చూసేందుకు వాళ్లెంతో ఆరాటపడతారు. అందుకే వాళ్లను అంతర్జాతీయ స్థాయి పోటీలకూ తీసుకెళ్లాలనుకుంటున్నా..’ అంటోంది ఆన్సీ.
లాంగ్ జంప్‌లో పూర్తి స్థాయి నైపుణ్యాలు సాధించి.. వివిధ పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తోంది ఆన్సీ.
2025- 'ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్’లో రజతం
2026- ‘ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్’లో కాంస్యం
ఇక ఈ ఏడాది ‘నేషనల్ ఫెడరేషన్ కప్’లో 6.75 మీటర్లు దూకి తన వ్యక్తిగత బెస్ట్‌ని మెరుగుపరుచుకుంది ఆన్సీ. ఇటీవలే భువనేశ్వర్‌లో జరిగిన ‘జాతీయ అంతర్రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్’లో పోటీపడిన ఆమె.. 6.88 మీటర్ల దూరం దూకింది. తద్వారా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అంజూ బాబీ జార్జ్ నమోదు చేసిన 6.83 మీటర్ల రికార్డును అధిగమించింది. ఇలా 22 ఏళ్ల తర్వాత సరికొత్త జాతీయ రికార్డును నమోదు చేసి వార్తల్లో నిలిచింది ఆన్సీ. అంతేకాదు.. ఈ గెలుపుతో ఆమె సెప్టెంబర్, అక్టోబర్లలో జరగబోయే ‘ఆసియా క్రీడల’కూ అర్హత సాధించింది. ఆసియాలోనే అత్యుత్తమ లాంగ్ జంపర్లలో ఒకరిగానూ స్థానం సంపాదించుకుంది.
అయితే తను సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పడం వెనుక ఓ సినిమా సన్నివేశం స్ఫూర్తి ఉందంటోంది ఆన్సీ.
‘మొదటి నాలుగు ప్రయత్నాల్లో జాతీయ రికార్డును బద్దలుకొట్టడానికి నా శాయశక్తులూ ఒడ్డా. ఇక ఐదో ప్రయత్నానికి కొన్ని క్షణాల ముందు ‘భాగ్ మిల్ఖా భాగ్’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నా. ‘ఓ వ్యక్తి హ్యాంగర్‌కి తగిలించి ఉన్న ఇండియా బ్లేజర్ని వేసుకొని మురిసిపోతుండగా క్రీడాకారులంతా వచ్చి అతడిని కొడుతుంటారు. అప్పుడు కోచ్ కలుగజేసుకొని.. ఇండియా బ్లేజర్ ధరించాలంటే పోటీలో గెలవాలి అని చెబుతారు.’ ఆ మాటలు నాలో దూకుడును మరింతగా పెంచాయి. ఫలితంగా 22 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టగలిగాను. రాబోయే ఆసియా క్రీడలే నా తదుపరి లక్ష్యం..’ అంటోందీ పాతికేళ్ల లాంగ్ జంపర్. ప్రస్తుతం తన అథ్లెటిక్ కెరీర్‌ని కొనసాగించడంతో పాటు భారత నావికా దళంలో ‘చీఫ్ పెట్టీ ఆఫీసర్’గానూ వ్యవహరిస్తోంది ఆన్సీ.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.