
దమ్మపేట, జూలై 02 : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, గురుకుల పాఠశాలల టెండర్లలో అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు...
దమ్మపేట, జూలై 02 : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, గురుకుల పాఠశాలల టెండర్లలో అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంత్రులు విసిరిన బహిరంగ చర్చ సవాలును స్వీకరించి, ఆధారాలతో సహా గన్‌పార్క్‌కు బయల్దేరిన నేతలను మార్గమధ్యలోనే అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వం పిరికితనానికి, అప్రజాస్వామిక ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలకు సమాధానం చెప్పలేక, పోలీసు బలగాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నించడం దుర్మార్గమని మెచ్చా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు ముందుకు వచ్చిన ప్రజా ప్రతినిధులను ముందస్తు అరెస్టులు చేయడం ద్వారా ప్రభుత్వం తన అసమర్థతను చాటుకుంటోందని ఆయన పేర్కొన్నారు. కేవలం పోలీసుల అండతో ప్రతిపక్షాలను భయపెట్టి, ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఫలించవని ఆయన హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన హరీశ్‌రావుతో పాటు పార్టీ నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రజా క్షేత్రంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఇలాంటి అణచివేత చర్యలు మానుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.