
ఇంటర్నెట్ డెస్క్: న్యాయ ప్రక్రియలో కృత్రిమ మేధ (Artificial Intelligence) వినియోగంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ధ్రువీకరించని ఏఐ ఆధారిత సమాచారం న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. న్యాయ ప్రక్రియలో ఏఐ వినియోగాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశించింది.
ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ఇచ్చిన తీర్పుపై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన సుప్రీం ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. నకిలీ, ఉనికిలో లేని పూర్వ తీర్పులను అందులో ప్రస్తావించారని, ఏఐ టూల్స్ సాయంతో దానిని సృష్టించినట్లు ధర్మాసనం గుర్తించింది. కల్పిత సమాచారాన్ని ప్రస్తావించడం న్యాయ ప్రక్రియకు చాలా హానికరమని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. సరైన ధ్రువీకరణ లేకుండా రూపొందించే ఈ ఏఐ తీర్పులపై కఠినంగా వ్యవహరించాలని న్యాయస్థానాలకు సూచించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.