
IPL 2027 Trading: ఐపీఎల్ క్రికెట్ అభిమానుల్లో ప్రస్తుతం ఒకే ఒక్క వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను రాబోయే సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్...
IPL 2027 Trading: ఐపీఎల్ క్రికెట్ అభిమానుల్లో ప్రస్తుతం ఒకే ఒక్క వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను రాబోయే సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ చేసుకోబోతోందనే ప్రచారం జోరందుకుంది. ఈ ఊహాగానాలపై తాజాగా సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ అసలు నిజానిజాలను వెల్లడించారు.
ట్రేడింగ్ రేసులో చెన్నై.. సోషల్ మీడియాలో ప్రకంపనలు..
గత ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్‌కు అంతగా కలిసి రాలేదు. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పాటు జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యా ముంబై జట్టును వీడాలని చూస్తున్నట్లు, ఆయనను దక్కించుకోవడానికి కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌తో పాటు మరో ఐదు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నట్లు ప్రచారం సాగింది. అందులో ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ పేరు ప్రముఖంగా వినిపించింది. చెన్నై జట్టుకు ఒక అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ అవసరం ఉండటంతో, అభిమానులు కూడా హార్దిక్ రాకను నిజమేనని నమ్మారు. సీఎస్కే సీఈఓతో పాండ్యా ఉన్న పాత ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తూ రచ్చ చేశారు.
ఈ సంచలన వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ ఇవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం తాము ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఒక క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ, "గత సీజన్ ప్రదర్శనపై మా జట్టు ఇంకా ఎలాంటి విశ్లేషణ చేయలేదు. మేజర్ లీగ్ క్రికెట్ ముగిసిన తర్వాతే దీనిపై దృష్టి పెడతాం. మేము ఇప్పటివరకు హార్దిక్ పాండ్యాతో కానీ, ముంబై ఇండియన్స్ యాజమాన్యంతో కానీ మాట్లాడలేదు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు" అని తేల్చి చెప్పారు.
ముంబైని వీడాలని హార్దిక్ ఎందుకు అనుకుంటున్నారు?
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో హార్దిక్ పాండ్యాకు పరిస్థితులు అనుకూలంగా లేవనేది బహిరంగ రహస్యం. గత సీజన్లో జట్టు రెండు గ్రూపులుగా విడిపోయిందని, ఆటగాళ్లు కెప్టెన్ వ్యూహాలకు సహకరించలేదనే చర్చ నడిచింది. దీనికి తోడు అభిమానుల నుంచి వచ్చిన తీవ్రమైన ప్రతికూలత, ఒత్తిడి కారణంగా ఆయన ముంబై జట్టు నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకుని, మరో జట్టులో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు క్రీడా వర్గాల సమాచారం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..