Is ITR Mandatory if Income is Below Taxable Limit : దేశవ్యాప్తంగా ప్రస్తుతం అసెస్మెంట్ ఇయర్ 2026-27 (ఆర్థిక సంవత్సరం 2025-26) కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు ప్రక్రియ వేగంగా సాగుతోంది.
చాలా మంది తమ వార్షిక ఆదాయం టాక్స్ పరిమితిలోపు ఉంటే ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. కొన్ని పరిస్థితుల్లో మీ ఆదాయం సున్నా అయినా సరే ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి. ప్రతి ఒక్కరూ ఎందుకు ఐటీఆర్ ఫైల్ చేయాలో, దాని వల్ల వచ్చే 8 ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టాక్స్ రిఫండ్- ఆర్థిక సంవత్సరంలో మీ జీతం లేదా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ లేదా ఇతర ఆదాయాలపై కంపెనీలు/బ్యాంకులు ముందే టీడీఎస్ కట్ చేస్తుంటాయి. ఒకవేళ మీ అసలు టాక్స్ లయబిలిటీ ఆ కట్ అయిన మొత్తం కంటే తక్కువగా ఉంటే ఆ అదనపు డబ్బును తిరిగి మీ అకౌంట్లోకి రీఫండ్ రూపంలో పొందొచ్చు. దీనికి ఐటీఆర్ ఫైలింగ్ ఒక్కటే మార్గం. ఐటీఆర్ చేయకపోతే ఐటీ శాఖ రిఫండ్ ప్రాసెస్ చేయదు. లాస్ క్యారీ ఫార్వర్డ్- మీకు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ లేదా సొంత బిజినెస్‌లో నష్టాలు వస్తే ఆ నష్టాల్ని తదుపరి సంవత్సరాల్లో వచ్చే లాభాలతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంతో భవిష్యత్తులో మీపై టాక్స్ భారం తగ్గుతుంది. ఈ నష్టాల్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే గడువు తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయాలి. బ్యాంక్ లోన్ అర్హత- మీరు హోం లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ దేనికోసమైనా అప్లై చేసినప్పుడు బ్యాంకులు చాలా వరకు 2-3 ఏళ్ల ఐటీఆర్ కాపీల్ని అడుగుతుంటాయి. క్రమంతప్పకుండా ఐటీఆర్ ఫైలింగ్ హిస్టరీ ఉంటే క్రెడిబిలిటీ పెరిగి లోన్ ఈజీగా వస్తుంది. ఫ్రీలాన్సర్స్, స్వయం ఉపాధి పొందే వారికి ఇది చాలా ప్లస్ అవుతుంది. వీసా అప్లికేషన్- మీరు టూరిస్ట్ లేదా బిజినెస్ లేదా స్టూడెంట్ వీసాపై యూఎస్, కెనడా, యూరప్ వంటి దేశాలకు వెళ్లాలనుకుంటే ఆయా దేశాల ఎంబసీలు మీ ఆర్థిక స్థిరత్వాన్ని తనిఖీ చేసేందుకు 2-3 ఏళ్ల ఐటీఆర్ రశీదుల్ని ప్రూఫ్‌గా అడుగుతుంటాయి. ఐటీఆర్ ఉండటం వల్ల వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సులు తగ్గుతాయి. ఆదాయం లేకపోయినా కొన్నిసార్లు తప్పనిసరి- ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మీ ఆదాయం టాక్స్ పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు కింది వాటిలో ఏ ఒక్కటి జరిగినా మీరు పక్కాగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. కరెంట్ అకౌంట్లలో రూ. 1 కోటికిపైగా డిపాజిట్ చేసినావిదేశీ ప్రయాణాల కోసం రూ. 2 లక్షలకుపైగా ఖర్చు చేసినా ఏడాదిలో కరెంట్ బిల్లు రూ. 1 లక్ష దాటినా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేట్ ఫీజు, వడ్డీ బాదుడు నుంచి రక్షణ- ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువు తేదీ మిస్ అయితే రూ. 5 వేల వరకు లేట్ ఫైలింగ్ ఫీజు పడుతుంది. ఒకవేళ మీ ఆదాయం రూ. 5 లక్షల్లోపు ఉంటే గరిష్ఠ లేట్ ఫీజు రూ. 1000 గా ఉంటుంది. దీంతో పాటు కట్టాల్సిన టాక్స్‌పై వడ్డీ కూడా పడుతుంది. అందుకే సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల దీని నుంచి తప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్ రికార్డ్ బిల్డింగ్ కోసం- ఐటీఆర్ అనేది దేశవ్యాప్తంగా అంగీకరించబడే అత్యంత నమ్మకమైన ఆదాయ ధ్రువీకరణ పత్రం. పెద్ద మొత్తంలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేటప్పుడు, ప్రభుత్వ టెండర్లకు అప్లై చేసేటప్పుడు, స్కాలర్ షిప్స్ లేదా బిజినెస్ ఫండింగ్స్ కోసం ప్రయత్నించేప్పుడు కూడా ఇది మీకెంతో ఉపయోగపడుతుంది. పరిమితి దాటితే తప్పనిసరి- ఇంకా 2025-26 ఆర్థిక సంవత్సరంలో మీ స్థూల ఆదాయం మొత్తం కనీస మినహాయింపు పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, మీరు కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.