
సూర్య ప్రకాష్ జోశ్యుల Rating: 2.5 క్రిప్టన్ గ్రహం అంతం అవుతుందనే విషయం జోర్-ఎల్, అతని భార్య అలురాకి అర్దమవుతుంది. దాంతో ఆ దంపతులు వెంటనే తమ చిన్నారి కారా జోర్-ఎల్ (మిల్లీ అల్కాక్).
-- సూర్య ప్రకాష్ జోశ్యుల Rating: 2.5 క్రిప్టన్ గ్రహం అంతం అవుతుందనే విషయం జోర్-ఎల్, అతని భార్య అలురాకి అర్దమవుతుంది. దాంతో ఆ దంపతులు వెంటనే తమ చిన్నారి కారా జోర్-ఎల్ (మిల్లీ అల్కాక్).ను, పెంపుడు కుక్క క్రిప్టో తో కలిపి భూమిపైకి పంపేస్తారు. అలా ఇక్కడకి వచ్చిన ఆమెకు తన కజిన్ క్లార్క్ కెంట్ అలియాస్ సూపర్‌మ్యాన్ కలిస్తాడు. అతను ఆమెకి అన్ని విధాలా అండగా నిలిచి కారా ని ... సూపర్‌గర్ల్ ని చేస్తాడు. ఇక కారా ...సూపర్ గర్ల్ అయిపోయింది కాబట్టి ఎవరు కష్టాల్లో ఉన్నారో ఉన్నారో చూడటం, వాళ్లను రక్షించటం అనే డ్యూటీ తీసుకుంటుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పటి జనరేషన్ కు చెందింది. పార్టీలంటే ప్రాణం. తాగుడుంటే ఇంక చెప్బక్కర్లేదు. రచ్చ రచ్చే. అలా తన 23వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి గ్రహాల మీద గ్రహాలు తిరుగుతూ... మత్తులో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంక సూపర్ గర్ల్ డ్యూటీ ఎక్కదా అంటే... "ప్రపంచాన్ని కాపాడాలా? ముందు హ్యాంగోవర్ దిగాలి కదా!" అన్నట్టుంటుంది. అఫ్ కోర్స్ అప్పడప్పుడు కొన్ని ఎటాక్ లు అవ్వీ చేస్తూంటుంది. తన పవర్స్ చెక్ చేసుకోవటానికి అన్నట్లు. ఇక ఓ పుట్టిన రోజు ట్రిప్‌లో రూతీ (ఈవ్ రిడ్లీ) అనే అమ్మాయి మన సూపర్ గర్ల్ కు పరిచయం అవుతుంది. బ్రిగాండ్ లీడర్ క్రెమ్ ఆఫ్ ది ఎల్లో హిల్స్ (మథియాస్ స్కోనార్ట్స్) అనే విలన్ తన కుటుంబాన్ని చంపేశాడని, అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని రూతీ ఎదురుచూస్తుంటుంది. అదే సూపర్ గర్ల్ తో చెప్పుకుంటుంది. విధి కూడా అప్పుడప్పుడూ బాగా ట్రోల్ చేస్తుంది కదా! దాంతో "నీ గొడవ... నువ్వే చూసుకో" అని సూపర్ గర్ల్ వెళ్లిపోదామనుకున్నా కుదరదు. ఎందుకంటే ఈలోగా క్రెమ్ అంతరిక్ష నౌకపై దాడి చేసి సూపర్‌గర్ల్ పెంపుడు కుక్క క్రిప్టోకు విషపు బాణం గుచ్చుతాడు. దానికి విరుగుడు మాత్రం క్రెమ్ దగ్గరే ఉంటుంది. అదీ 72 గంటల్లో తెచ్చుకోకపోతే... క్రిప్టో కథ ముగిసినట్టే. ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా రూతీతో చేతులు కలపాల్సిందే. ఒకవైపు రూతీకి ప్రతీకారం... మరోవైపు క్రిప్టో ప్రాణాలు. ఈ రెండింటి కోసం సూపర్‌గర్ల్ బిల్క్వస్ గ్రహానికి బయలుదేరుతుంది. మరి క్రెమ్ను సూపర్‌గర్ల్ ఎలా ఎదుర్కొంది? క్రిప్టోను కాపాడగలిగిందా? రూతీ ప్రతీకారం తీరిందా? చివరికి మత్తులో జోగే సూపర్హీరోయిన్ తన మిషన్‌ను పూర్తి చేసిందా? అన్నదే మిగతా కథ. విశ్లేషణ సాధారణంగా ఒక సూపర్ హీరో సినిమా అంటే మనంఏమి ఆశిస్తాం? ఒక బలమైన విలన్... హీరోకు గుర్తుండిపోయే ఎలివేషన్స్... చప్పట్లతో మార్మోగే క్లైమాక్స్.. అన్నింటికంటే ముఖ్యంగా... హీరోతో ఎమోషనల్ కనెక్షన్. సూపర్‌గర్ల్ సినిమాలో ఇవన్నీ ఉన్నాయి అనిపిస్తాయి. కానీ ఒక్కటి కూడా స్ట్రాంగ్ గా డిజైన్ చేయలేదు. అదే ఈ సినిమా అతిపెద్ద సమస్య. దాంతో సినిమా తెరపై వెళ్లుపోతూంటుంది కానీ మనకు పెద్దగా కనెక్ట్ కాదు. సూపర్‌మ్యాన్ తో కొత్త డీసీ యూనివర్స్‌కు మంచి ఆరంభం ఇచ్చిన జేమ్స్ గన్... రెండో సినిమాతో ఆ ఊపును కొనసాగిస్తాడని చాలామంది ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రకు గోల్ లేదు, తప్పనసరిగా చేయాల్సిన మిషన్ మాత్రమే ఉంది. అదే గోల్ అనుకుంటే ఏ గోలా లేదు. అలాగే సూపర్ హీరో సినిమాల్లో ప్రయాణం రెండు స్థాయిల్లో ఉంటుంది. ఒకటి బయట కనిపించే లక్ష్యం. మరొకటి ఆ పాత్రకు లోపల జరిగే మార్పు. అయితే ఈ సినిమాలో బయట కనిపించే లక్ష్యం చాలా సింపుల్. క్రిప్టోకు విషం బాణం గుచ్చుకుంది. 72 గంటల్లో విరుగుడు తెచ్చాలి. ఇదే కథను నడిపించే మిషన్. కానీ... ఈ సూపర్ గర్ల్ కారా లోపల ఏ యుద్ధం చేస్తోంది? తన గతంతో పోరాడుతోందా? ఒంటరితనంతోనా?కుటుంబాన్ని కోల్పోయిన బాధతోనా? సినిమా ఈ ప్రశ్నలకు దేనికీ సరైన సమాధానం ఇవ్వదు. దీంతో సీన్స్ వారీగా కథ ముందుకు వెళ్తుంది... కానీ క్యారెక్టర్ మాత్రం అక్కడే నిలిచిపోతుంది. అయినా కారా పాత్ర పెద్ద తాగుబోతు అని చూపెట్టడం వలన ఏమి ఒరిగిందో అసలు అర్దం కాదు. దాంతో చూసే మనం కారా కోసం కాకుండా... "కుక్క బతుకుతుందా?" అన్న ప్రశ్న కోసం సినిమా చూస్తాం. అంటే కథలోని ఎమోషనల్ ఫోకస్ ప్రధాన పాత్ర నుంచి మరో చోటికి వెళ్లిపోయింది. అదే స్క్రిప్ట్ బలహీనత. దాంతో క్లైమాక్స్ వచ్చేసరికి యాక్షన్ కనిపించినా గూస్బంప్స్ మాత్రం రావు. ఎందుకంటే ఆమెతో మనం జర్నీ చేయటం లేదు. మిల్లీ ఆల్కాక్... స్క్రిప్ట్‌ను మించిన నటన, చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. రెబెల్ యాటిట్యూడ్‌ను బాగా పట్టుకుంది. యాక్షన్‌లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కానీ స్క్రిప్టు ఆమెకు సహకరించలేదు. ఫైనల్ థాట్ "సూపర్ పవర్స్ ఉంటే సరిపోదు... సూపర్ స్క్రిప్ట్ కూడా ఉండాలి." లేదంటే సూపర్‌మ్యాన్ ఎంత ఎత్తుకు ఎగిరినా... ప్రేక్షకుడి మనసులో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేడు. ప్రపంచాన్ని కాపాడే సూపర్ మ్యాన్... సినిమాని కాపాడలేడు.