
2026 సంవత్సరం గడిచి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఆరు నెలల్లో తమిళ సినిమా ఎన్నో హిట్లు, ఫ్లాపులు చూసింది. విశేషం ఏంటంటే, భారీ అంచనాలతో వచ్చిన చాలా సినిమాలు బోల్తా కొట్టాయి.
కానీ, చిన్న బడ్జెట్ చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. 2026 ప్రథమార్థంలో రిలీజైన సినిమాల్లో ఏది హిట్? ఏది ఫట్ అనేది చూస్తే.
ఫిబ్రవరి నెలలో చిన్న బడ్జెట్ సినిమాలే రిలీజయ్యాయి. మొదటి వారంలో రజనీకాంత్ కూతురు సౌందర్య నిర్మించిన 'విత్ లవ్' వచ్చింది. అభిషన్ జీవింత్ హీరోగా నటించిన ఈ సినిమా రూ.39 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్టయింది. తర్వాత వచ్చిన 'పూకి', 'మై లార్డ్' ఫ్లాపయ్యాయి. నెల చివర్లో వచ్చిన రాధిక 'తాయ్ కిళవి' చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసి రూ.82 కోట్లు కొల్లగొట్టింది.
మే నెలలో తమిళ సినిమాకి ప్రాణం పోశారు సూర్య, అర్జున్. ఆ నెలలో రిలీజైన సూర్య 'కరుప్పు', అర్జున్ 'బ్లాస్ట్' సినిమాలు రెండూ బ్లాక్‌బస్టర్ హిట్టయ్యాయి. ఈ చిత్రాలు వాళ్లిద్దరికీ అదిరిపోయే కంబ్యాక్‌గా నిలిచాయి. ఇందులో 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద రూ.310 కోట్లు కొల్లగొట్టి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది. అలాగే అర్జున్ 'బ్లాస్ట్' సర్ప్రైజ్ హిట్టయి రూ.75 కోట్లు వసూలు చేసింది.
జూన్ ఆరంభంలో పాండిరాజ్ దర్శకత్వంలో 'పరిమళా అండ్ కో' సినిమా విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.14 కోట్లు వసూలు చేసి హిట్ లిస్ట్‌లో చేరింది. ఆ తర్వాత వచ్చిన 'హబీబీ', 'డబుల్ ఆక్యుపెన్సీ' చిత్రాలకు మంచి రివ్యూలు వచ్చినా కలెక్షన్లు రాలేదు. జూన్ చివర్లో వచ్చిన విజయ్ ఆంటోనీ 'నూరు సామి', సమంత ‘ఎంగళ్ తంగం’(మా ఇంటి బంగారం) , అర్జున్ దాస్ 'ఖాన్ సిటీ' సినిమాలు మంచి టాక్‌తో థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్నాయి. సమంత మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యింది. తమిళంలోనూ మంచి వసూళ్లు రావడం విశేషం. మొత్తంగా తమిళ సినిమాని ఈ హాఫ్ ఇయర్లో సూర్య, అర్జున్, రాధికా, కెన్ కరుణాస్ వంటి వారు దుమ్ములేపారని చెప్పొచ్చు.