
ప్రస్తుతం మన భూమి చుట్టూ లోఎర్త్ ఆర్బిట్ లో 14,000 కంటే ఎక్కువ శాటిలైట్లు తిరుగుతున్నాయి. స్పేస్ హిస్టరీలోనే ఇది చాలా పెద్ద నంబర్. కానీ, రాబోయే రోజుల్లో ఈ నంబర్ ఏకంగా వంద రెట్లకు పైగా పెరగబోతోంది.
వివిధ ప్రైవేట్ కంపెనీలు, దేశాలు కలిసి రాబోయే ఏళ్లలో ఏకంగా 17 లక్షల కొత్త శాటిలైట్లను అంతరిక్షంలోకి లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి.
అయితే, ఈ నిర్ణయం వల్ల గ్రౌండ్ బేస్డ్ అస్ట్రానమీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ‘యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ’ (ESO) చేసిన ఒక తాజా పీర్ రివ్యూడ్ స్టడీ హెచ్చరించింది. ఈ శాటిలైట్ల వల్ల రాత్రి పూట ఆకాశం సాధారణం కంటే నాలుగు రెట్లు ఎక్కువ వెలుగుతో నిండిపోతుందని, దీనివల్ల ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌లు ప్రతి రాత్రీ కొన్ని గంటల పాటు పూర్తిగా బ్లైండ్ అయిపోతాయని ఈ స్టడీ స్పష్టం చేసింది. ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని తిరిగి వెనక్కి తీసుకోలేని 'పాయింట్ ఆఫ్ నో రిటర్న్' గా అభివర్ణిస్తున్నారు.
ఈ అంతరిక్ష సంక్షోభానికి ప్రధాన కారణం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ (SpaceX) కంపెనీయే. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఇప్పటికే వేలాది స్టార్‌లింక్ శాటిలైట్లను నడుపుతున్న ఈ కంపెనీ, అంతరిక్షంలో ఒక డేటా సెంటర్ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేయడం కోసం మరో 10 లక్షలకు పైగా అదనపు శాటిలైట్లను లాంచ్ చేయడానికి రెగ్యులేటర్లకు దరఖాస్తు చేసుకుంది.
స్పేస్ఎక్స్ మాత్రమే కాదు, ‘ఇ-స్పేస్’ అనే శాటిలైట్ స్టార్టప్ కంపెనీ కూడా ‘సిన్నమోన్’ పేరుతో లక్షలాది శాటిలైట్లను పంపేందుకు ప్లాన్ చేస్తోంది. అటు చైనా కూడా సీటీసీ-1, సీటీసీ-2 పేరుతో రెండు భారీ నెట్‌వర్క్‌ల ద్వారా లక్షలాది శాటిలైట్లను పంపడానికి సిద్ధమవుతోంది. ఇక అన్నింటికంటే షాకింగ్ ఏంటంటే.. ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ అనే కంపెనీ ఏకంగా 50,000 మిర్రర్ శాటిలైట్లను పంపాలని చూస్తోంది. ఇవి రాత్రి వేళల్లో సూర్యుడి వెలుగును నేరుగా భూమిపైకి రిఫ్లెక్ట్ చేస్తాయి. దీనివల్ల రాత్రి పూట ఆకాశం విపరీతంగా వెలిగిపోనుంది.
ఈ రీసెర్చ్‌ను లీడ్ చేసిన ఒలివియర్ హైనాట్ అనే శాస్త్రవేత్తకు అబ్జర్వేటరీలో 30 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. వేర్వేరు శాటిలైట్ల నంబర్ల వల్ల టెలిస్కోప్లపై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో ఆయన ఒక మోడల్ ద్వారా లెక్కించారు. ఆయన రిపోర్ట్ ప్రకారం.. అంతరిక్షంలో కేవలం 1,00,000 శాటిలైట్లు మాత్రమే ఉంటే ఖగోళ పరిశోధనలకు ఎలాంటి తీవ్రమైన నష్టం జరగదు. పైగా అవి సాధారణ కంటికి కనిపించనంత తక్కువ వెలుతురుతో ఉండాలి. కానీ, ఇప్పుడు ప్రతిపాదనల్లో ఉన్న 17 లక్షల నంబర్ అనేది ఈ సేఫ్ లిమిట్ కంటే 17 రెట్లు ఎక్కువ.
ఈ 17 లక్షల శాటిలైట్లు వస్తే భూమిపై ఉన్న అబ్జర్వేటరీల పరిస్థితి ఏంటనే దానిపై శాస్త్రవేత్తలు సిమ్యులేషన్స్ రన్ చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఆప్టికల్ టెలిస్కోప్ అయిన యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన ‘వెరీ లార్జ్ టెలిస్కోప్’ (VLT) ఇమేజింగ్ కెపాసిటీ 28 శాతం వరకు దెబ్బతింటుంది. శాటిలైట్లు వెళ్లేటప్పుడు పడే బ్రైట్ లైన్ స్ట్రీక్స్ వల్ల ఫోటోలు పాడైపోతాయి.
అలాగే, చిలీలో ఉన్న ‘వెరా సి. రూబిన్ అబ్జర్వేటరీ’ దక్షిణ ఆకాశాన్ని సర్వే చేయడానికి, భూమికి ముప్పుగా మారే ఆస్టరాయిడ్స్ ను కనిపెట్టడానికి చాలా కీలకం. కానీ ఈ శాటిలైట్ల వెలుతురు వల్ల ట్విలైట్ లో ఈ టెలిస్కోప్ తీసే మోస్ట్ ఆఫ్ ది ఇమేజెస్ పనికిరాకుండా పోతాయి. ఫలితంగా భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న ప్రమాదకరమైన గ్రహశకలాలను ముందుగా గుర్తించే అవకాశాన్ని మనం కోల్పోతాము.
సాధారణ శాటిలైట్లు కేవలం ఫోటోలలో వెలుగు చారలను మాత్రమే క్రియేట్ చేస్తే, ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ ప్లాన్ చేస్తున్న 50,000 మిర్రర్ శాటిలైట్లు అంతకంటే పెద్ద ప్రమాదాన్ని తెస్తున్నాయి. ఇవి రాత్రి ఆకాశం బేస్‌లైన్ బ్రైట్నెస్ను ఏకంగా 3 నుండి 4 రెట్లు పెంచేస్తాయి. శాటిలైట్లు వెళ్లే టైమింగ్స్ చూసుకుని రీసెర్చ్ చేద్దామన్నా ఇది కుదరదు. ఎందుకంటే ఆకాశం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఆకాశంలో బ్యాక్‌గ్రౌండ్ వెలుతురు అంతలా పెరిగితే, సుదూర విశ్వంలో ఉండే గెలాక్సీలు, ఎక్సోప్లానెట్లు, విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన ప్రాచీన కాంతిని భూమిపై నుండి అసలు చూడలేము. అందుకే ఈ అప్లికేషన్‌కు వ్యతిరేకంగా ఎఫ్‌సీసీ కి 1,500 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.
ప్రస్తుతం అమెరికాకు చెందిన ఎఫ్‌సీసీ స్పేస్ఎక్స్, రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అప్లికేషన్లను పరిశీలిస్తోంది. వీటిపై ఇప్పటికే వేలాది అభ్యంతరాలు వచ్చాయి. ఇంటర్నేషనల్ అస్ట్రానమికల్ యూనియన్ వంటి అంతర్జాతీయ సంస్థలు శాటిలైట్ల బ్రైట్‌నెస్‌పై గ్లోబల్ రూల్స్ తేవాలని, వాటి సంఖ్యపై క్యాప్ విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అంతర్జాతీయ బైండింగ్ చట్టాలు లేవు. శాటిలైట్ ఆపరేటర్లు తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. బిజినెస్ లాభాలు, ఇంటర్నెట్ కాంపిటీషన్ కారణంగా రెగ్యులేటరీ సంస్థల కంటే వేగంగా కంపెనీలు అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇది ఖగోళ శాస్త్రానికి చివరి హెచ్చరిక అని ఒలివియర్ హైనాట్ చెప్తున్నారు. ఒకసారి ఈ 17 లక్షల శాటిలైట్లు కక్ష్యలోకి చేరితే, ఆ తర్వాత వాటిని వెనక్కి పిలవడం ఇంపాజిబుల్. మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి అందరికీ ఉమ్మడి ఆస్తిగా ఉన్న రాత్రి ఆకాశం, కేవలం కొన్ని కంపెనీల కమర్షియల్ నిర్ణయాల వల్ల శాశ్వతంగా మారిపోనుందని హెచ్చరిస్తున్నారు.