
నటసింహ బాలకృష్ణ నూటపదకొండో సినిమా టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ కంటే మిన్నగా బాలయ్య 112వ చిత్రంపై ప్రెజర్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఎందుకలాగా!?
బాలకృష్ణ పేరు చెప్పగానే ఆయన పోషించిన పవర్ ఫుల్ రోల్స్ ముందుగా గుర్తుకు వస్తాయి. ఫ్యాన్స్ సైతం ఆయన ఎమోషనల్ రోల్స్ నే లైక్ చేస్తున్నారు. 'అఖండ' సినిమా తరువాత నుంచీ బాలయ్య కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగుతున్నారాయన. 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్', 'అఖండ-2' చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఈ చిత్రాల దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ- ఎవరికి వారు తమదైన పంథాలో బాలయ్యను డిఫరెంట్ రోల్స్ లో స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు. అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ మెప్పించారు. బాలయ్య 111వ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ మిళితం చేసి అభిమానులు కోరుకొనే విధంగా బాలయ్య నటనతో ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పైగా బాలయ్య, గోపీచంద్ కాంబోను ఇప్పటికే 'వీరసింహారెడ్డి'లో చూసి మురిసిపోయారు జనం. అందువల్ల వారి రెండో సినిమాకంటే బాలయ్యతో తొలిసారి పనిచేస్తోన్న కొరటాల శివ మూవీపైనే అందరి చూపు సాగుతోంది. దాంతో ఆ ప్రాజెక్ట్ పైనే ఎక్కువ ప్రెజర్ పడుతోందని వినిపిస్తోంది.
గతంలో కొరటాల శివ రూపొందించిన చిత్రాల్లో ఒకే ఒక్క సినిమా మినహాయిస్తే అన్నీ బాక్సాఫీస్ ను షేక్ చేసినవే ఉన్నాయి. 'మిర్చి'తో ప్రభాస్ ను కొత్తగా చూపించారు. 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' సినిమాల్లో మహేశ్ ను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు. 'జనతా గ్యారేజ్', 'దేవర' మూవీస్ లో జూనియర్ యన్టీఆర్ లోని అసలు నటుణ్ణి జనం ముందు నిలిపారు. ఈ నేపథ్యంలో సీనియర్ స్టార్ హీరో బాలయ్యతో కొరటాల శివ ఏ తీరున ప్రేక్షకులను ఆకట్టుకుంటారో అన్న ఆసక్తి సినీజనాల్లో చోటు చేసుకుంది. పైగా బాలయ్య ఇమేజ్ ను ఉపయోగించుకుంటూనే కొరటాల శివ నవతరం ప్రేక్షకులు మెచ్చే తీరులో సినిమాను తెరకెక్కించాల్సి ఉంటుంది. అందునా బాలయ్యతో తొలి ప్రయత్నం కాబట్టి మరింత వైవిధ్యంగా కొరటాల ఆ మూవీని రూపొందించాలి. అందువల్లే బాలయ్య 112వ సినిమాపైనే వత్తిడి ఉందని టాక్.
బాలకృష్ణతో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ తో అత్యధిక హిట్స్ చూసిన క్రెడిట్ బాలయ్యకే దక్కుతుంది. 'పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్స్ అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ చిత్రాలకంటే భిన్నంగా బాలయ్య నటనను కొరటాల శివ రాబట్టాల్సి ఉంది. అదో ఛాలెంజ్ కాగా, బాలయ్య- కొరటాల శివ చిత్రంతోనే అమరావతిలో తెలుగు సినిమా సందడి మొదలయింది. ఈ సినిమా అందరూ మెచ్చేలా రూపొంది ఘనవిజయం సాధిస్తే, మిగతా స్టార్స్ సైతం అమరావతివైపు పరుగులు తీయడానికి కారణమవుతుంది. అందువల్ల బాలయ్య 112వ చిత్రంపైనే అందరి చూపులు సాగుతున్నాయి. కొరటాల శివపైనే వత్తిడి ఎక్కువగా ఉంటోంది. మరి బాలయ్య-కొరటాల కాంబోలో వచ్చే సినిమా ఏ తీరున అలరిస్తుందో చూడాలి.
Kayadu Lohar: టెన్త్ క్లాస్‌లోనే అంత పని చేసిందా?
వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!