
అమెరికా, ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన దౌత్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన దౌత్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన పరోక్ష చర్చలు ఫలవంతంగా సాగినట్లు ఖతార్ వెల్లడించింది. ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందంలోని అంశాల అమలుపై పురోగతి కనిపించిందని, తదుపరి విడత చర్చలు కూడా కొనసాగనున్నాయని తెలిపింది (Doha Talks).
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూడా ఈ చర్చలపై ఆశావహ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇరాన్ ప్రస్తుతం చాలా మంచి అవగాహనతో ముందుకు వెళ్తున్నాయని, అణు కార్యక్రమంపై ఒప్పందానికి చేరుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య విభేదాలు తగ్గుతున్నాయని, హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రత, కాల్పుల విరమణ కొనసాగింపు వంటి అంశాలపైనా చర్చలు సానుకూలంగా సాగాయని పేర్కొన్నారు.
మరోకవైపు, తుది అణు ఒప్పందంపై ఇప్పటికీ స్పష్టమైన పురోగతి లేదని వార్తలు వస్తున్నాయి (Iran Nuclear Deal). తాజా దోహా సమావేశాల్లో ప్రధానంగా హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రత, ఇరాన్ నిధుల విడుదల వంటి అంశాలే చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం తదుపరి విడత చర్చలు జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్