
లీటరు సాధారణ పాల ధర సుమారు రూ.80 ఉంటే.. వీగన్ (ప్లాంట్ బేస్డ్) పాలు రూ.150 పైమాటే! 250 గ్రాముల సాధారణ గులాబ్ జామూన్ మిక్స్ ధర రూ.100 ఉంటే.. వీగన్ది రూ.250 పలుకుతోంది.
ఇంత ధర పెట్టి కొనలేక చాలామంది ఆ దిశగా ఆలోచించడం లేదు. ఎక్కువ ధరలకు కారణం.. వీగన్ ఆహార ఉత్పత్తి పెద్దమొత్తంలో లేకపోవడం. ఉన్నా... వాటిలో ప్రిజర్వేటివ్స్ వాడకపోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వకు అవకాశం ఉండదు. దీనికి పరిష్కారంగా వీగన్ ఆహారం ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చంటున్నారు.. హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన నిర్వాణ నౌరీష్ నిర్వాహకురాలు బండారి శిరీష.
పెరుగు కోసం పాలు సిద్ధం చేయిస్తున్న శిరీష
ఈనాడు, హైదరాబాద్: ఇటీవల కొంతకాలంగా నగరంలో వీగన్ ఉద్యమం ఊపందుకుంది. సికింద్రాబాద్, గచ్చిబౌలి, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఒక్కోనెలా ఒక్కో ప్రాంతంలో వీగన్ మార్కెట్లు నిర్వహిస్తున్నారు. వీగన్లు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుని... మార్కెట్లు నిర్వహించే రోజు వచ్చి క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఇలాంటి మార్కెట్లలో కొన్నేళ్లుగా ఆమె పాల్గొంటున్నారు. వీగన్ ఆహారాన్ని ఇంటి వద్దే చవకగా, సులువుగా చేసుకోవచ్చని ప్రచారం చేస్తున్నారు. పూర్తి మొక్కల సంబంధిత పదార్థాలతో అన్ని రకాల ఆహారం తయారు చేసి... తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వీగన్ ఆహారం ఎలా తయారు చేసుకోవాలో ప్రతి శుక్రవారం ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. పాల ఉత్పత్తులు, చిరుతిళ్లు కూడా పెద్దమొత్తంలో సరఫరా చేస్తున్నారు.
కప్పు రాగులను 6 గంటలు నానబెట్టాలి. వాటికి కప్పు నీళ్లు కలిపి మిక్సీ పట్టాలి. కొద్దిగా మెత్తగా అయ్యాక మళ్లీ 3 కప్పుల నీళ్లు పోసి బాగా మిక్సీ పట్టాలి. ఇలా అయిన మిశ్రమాన్ని వడపోస్తే సరి. 3 కప్పుల పాలు రెడీ. సాధారణ పాలు ఎలా ఉపయోగిస్తామో వీటిని అలాగే వాడుకోవచ్చు. పెరుగు, బటర్ కూడా చేసుకోవచ్చు. కాల్షియం లోపం నివారణకు ఈ పాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
‘గుప్పెడు రాగులు లేదా నువ్వులతో 2 కప్పుల పాలు చేసుకోవచ్చు’ అంటున్నారు శిరీష. కిలో రాగులతో ఏకంగా 6 లీటర్ల పాలు తయారు చేయవచ్చని తెలిపారు. అంటే.. సాధారణ పాలు లీటరు కొనేందుకయ్యే మొత్తంతో ఏకంగా 6 లీటర్ల పాలు చేసుకోవచ్చని వివరించారు.
వీగన్ గులాబ్ జామున్‌లో పాల పొడి, మైదా ఉండవు. ఉడికించిన చిలగడదుంప గుజ్జు ఒక కప్పు, పాల పొడి బదులు జీడిపప్పు పొడి లేదా బాదం పొడి 4 చెంచాలు, 2 స్పూన్ల గోధుమ పిండి, సగం చెంచా యాలకుల పొడి, తీపి కోసం ఖర్జూర కలిపి చిన్న లడ్డూల్లా చేస్తే గులాబ్ జామూన్లు సిద్ధమైపోతాయి. వీటిని బెల్లం పాకంలో వేసి నోట్లో వేసుకోవడమే తరువాయి.
‘వేయించిన కాబూలీ శనగల పొడికి కాఫీ పౌడర్‌గా వీగన్స్‌లో మంచి గిరాకీ ఉంది. ఇది 80 శాతం సాధారణ కాఫీ రుచినే పోలి ఉంటుందంటారు వారు. దీనిలో కెఫిన్ ఉండదని.. ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. వీగన్ ఆహారంలో రంగుల కోసం క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కల సంబంధ ఉత్పత్తులే వాడుతున్నారు. విటమిన్ బీ12 కూడా ఎంతో అవసరం. ఇందుకోసం వీగన్స్ ఫోర్టిఫైడ్ ఫుడ్ తీసుకోవాలి. డీ విటమిన్ లోపం కూడా తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని జాతీయ పోషకాహార సంస్థ మాజీ శాస్త్రవేత్త డా.లక్ష్మయ్య సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.