ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. దేశవ్యాప్తంగా వీబీ జీ రాం జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్ - గ్రామీణ చట్టం 2025) కింద గ్రామీణ ఉపాధి హామీ పనులకు చెల్లించే...
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. దేశవ్యాప్తంగా వీబీ జీ రాం జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్ - గ్రామీణ చట్టం 2025) కింద గ్రామీణ ఉపాధి హామీ పనులకు చెల్లించే వేతనాలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం రూ.5 (1.6%) పెంచారు.. దీంతో రోజువారీ వేతనం రూ.312కు పెరిగింది. తెలంగాణలో రూ.1 (0.3%) పెరిగి రోజువారీ వేతనం రూ.308 చొప్పున ఇస్తారు. జులై 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానుండగా.. కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా రేట్లు నిర్ణయించింది. మొత్తం 21 రాష్ట్రాల్లో కనీస వేతనం రూ.300 కాగా.. తెలుగు రాష్ట్రాలలో మాత్రం పెంపుదల నామమాత్రంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ, తెలంగాణలో కనీస వేతనం తక్కువగానే ఉంది. వీబీ జీ రాం జీ వేతనం దేశంలోనే అత్యధికంగా సిక్కింలో (మూడు పంచాయతీల్లో) రూ.61 పెరిగి రూ.450కి చేరింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో రూ.32 (8.7%,) పెంచడంతో రూ.401కి చేరింది. కర్ణాటకలో రూ.12 (3.2%,) పెంచగా..రూ.382కు పెరిగింది. తమిళనాడులో రూ.9 (2.7%) వేతనం పెరిగింది. గోవాలో రూ.406, పుదుచ్చేరిలో రూ.347, ఒడిశాలో రూ.27, మహారాష్ట్రలో రూ.5 చొప్పున పెంచారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని షెడ్యూలు ప్రాంతాల్లో రూ.66 చొప్పున పెరిగి వేతనం రూ.375 అయ్యింది. వీబీ జీ రాం జీ చట్టం కింది ఉపాధి హామీని 125 రోజులకు విస్తరించారు. మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీరాం జీ ప్రారంభ కార్యక్రమం తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో ఇవాళ నిర్వహిస్తారు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆ గ్రామంలో రూ.4.55 లక్షలతో ప్రతిపాదించిన మూడు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పమక్షలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా వర్షపునీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం చేపడతారు. వాస్తవానికి గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీబీ జీరాం జీని కూడా ఏపీలోని తిరుపతి జిల్లా నుంచే కేంద్ర ప్రభుత్వం ప్రారంభింస్తోంది.