CM Vijay Supreme Court Petition : తమిళనాడులో గోవధ, దూడల వధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు జారీ చేసిన ఈ వివాదాస్పద ఉత్తర్వులు రాష్ట్రంలో అమలులో ఉన్న చట్టాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయంటూ అత్యున్నత న్యాయస్థానంలో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. మద్రాస్ హైకోర్టు పరిధి దాటి ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు, పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది.ప్రభుత్వం వాదన ఏంటంటే?మే 27వ తేదీన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్.. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా బక్రీద్ పండుగతో పాటు అన్ని రోజుల్లో ఆవులు, దూడలను వధించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విజయ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో బలమైన వాదనలను వినిపించింది. రాష్ట్రంలో 1958 నుంచి అమలులో ఉన్న ' తమిళనాడు జంతు సంరక్షణ చట్టం ' ప్రకారం.. 10 ఏళ్లు పైబడి, సంతానోత్పత్తికి పనికి రావని ధృవీకరించిన ఆవులను వధించడానికి చట్టబద్ధమైన అనుమతి ఉంది. అయితే మద్రాస్ హైకోర్టు ఈ చట్టాన్ని పక్కనబెట్టి.. ఏకంగా సంపూర్ణ నిషేధాన్ని విధించడం కోర్టుల పరిధిని దాటి ప్రవర్తించడమే అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా కోయంబత్తూరులో బక్రీద్ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో జంతు వధను నియంత్రించాలని మాత్రమే పిటిషనర్ కోరారని గుర్తు చేసింది. కానీ హైకోర్టు మాత్రం పిటిషనర్ అడగని పెద్ద ఉపశమనాన్ని ఇస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా పూర్తి నిషేధాన్ని విధించిందని ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.ఇదీ చూడండి: 'బక్రీద్ రోజు బహిరంగ ప్రదేశాల్లో ఆ జంతువులను అస్సలే బలివొద్దు': ఢిల్లీ సర్కార్మతపరమైన ఆచారాల్లో జోక్యమా?హైకోర్టు తీర్పు కేవలం ముస్లింలకే కాకుండా హిందూ సంప్రదాయాలకు కూడా ఆటంకంగా మారిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా స్పందిస్తూ.. "ఎవరూ పాలిచ్చే ఆవులను లేదా చిన్న దూడలను వధించరు. కానీ ఈ తీర్పు ఎద్దులు, గేదెలపై కూడా ప్రభావం చూపిస్తోంది. కేవలం ముస్లింల బక్రీద్ త్యాగాలకే కాకుండా, తమిళనాడులోని పలు హిందూ దేవాలయాలలో జరిగే వార్షిక జాతరల మతపరమైన జంతు బలులకు కూడా ఇది ఇబ్బందిగా మారింది. పండుగల వేళ స్థానిక నిబంధనల ప్రకారం ప్రైవేట్ ప్రాంగణాల్లో చేసుకునే సాంప్రదాయాలను మార్చడం రాజ్యాంగ విరుద్ధం" అని అన్నారు.ఇదీ చూడండి: 'ఈసారి గోవధ వద్దు': బక్రీద్ పండుగ వేళ అస్సాం ఈద్ కమిటీల సంచలన నిర్ణయంఅలాగే జంతువులను కేవలం లైసెన్స్ పొందిన మున్సిపల్ కసాయ్ఖానాలలోనే వధించాలనడం ఆచరణ సాధ్యం కాదని.. పండుగ డిమాండ్‌ను తట్టుకునే సామర్థ్యం వాటికి లేదని ఎంఎంకే అధ్యక్షుడు ఎంహెచ్ జవాహిరుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ని ఉల్లంఘించడమేనని అన్నారు. అయితే ఈ తీర్పుపై విజయ్ ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని విపక్షాలు విమర్శించగా.. "ఇంతటి సున్నితమైన అంశంపై అత్యున్నత స్థాయి చట్టపరమైన నిపుణులతో సంప్రదింపులు జరపడానికి కొంత సమయం పట్టిందని" టీవీకే పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.