
ఇంటర్నెట్ డెస్క్: టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ (Serena Williams) దాదాపు నాలుగేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ బరిలోకి దిగింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వింబుల్డన్‌లో పునరాగమనం చేసిన ఈ అమెరికా స్టార్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. తొలి రౌండ్లో 20 ఏళ్ల మాయా జాయింట్ చేతిలో సెరెనా ఓడిపోయింది. 23 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన సెరెనా పునరాగమనంలో మెరుగైన ఆటతీరునే ప్రదర్శించింది. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన మాయ 6-3, 6-7(6), 6-3 తేడాతో సెరెనాను ఓడించింది.
తొలి రౌండ్‌ను అలవోకగానే గెలుచుకున్న మాయాకు.. రెండో రౌండ్లో సీనియర్ సెరెనా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇరువురూ చెరొకటి గెలిచి సమంగా నిలిచారు. దీంతో నిర్ణయాత్మక మూడో రౌండ్ మరింత ఉత్కంఠగా సాగుతుందని అభిమానులు భావించారు. కానీ, మాయా దూకుడు ముందు సెరెనా నిలవలేకపోయింది. ఈ మ్యాచ్‌ను సెరెనా కుమార్తె ఒలంపియా ప్రత్యక్షంగా వీక్షించింది.
సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ, సెరెనా మాత్రం అలాంటిదేమీ చేయకుండా వెళ్లిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. దీంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. వేల డాలర్లు ఖర్చు పెట్టి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కించుకుని.. ఇప్పుడు కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ మాట్లాడకపోవడం సరికాదంటూ కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలో సెరెనా పేరుతో.. వింబుల్డన్ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘వింబుల్డన్లోకి తిరిగిరావడం చాలా ఆనందంగా ఉంది. దీన్ని చాలా మిస్ అయ్యా. మళ్లీ వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉంది. బాగా ఆస్వాదించాను. ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేశా’’ అని సెరెనా వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.