
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్’కు ఆస్ట్రేలియాలో చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ప్రైమ్ వీడియో (Amazon Prime Video) స్ట్రీమింగ్ మధ్యలో వాణిజ్య ప్రకటనలను ప్రవేశపెట్టడం,...
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్’కు ఆస్ట్రేలియాలో చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ప్రైమ్ వీడియో (Amazon Prime Video) స్ట్రీమింగ్ మధ్యలో వాణిజ్య ప్రకటనలను ప్రవేశపెట్టడం, ఇవి రాకుండా ఉండాలంటే వినియోగదారుల నుంచి అదనపు రుసుము వసూలు చేయడమే ఇందుకు కారణం. దీనిని ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ (ACCC) సీరియస్‌గా తీసుకుంది. ఫెడరల్ కోర్టులో అమెజాన్‌పై దావా వేసింది.
వార్షిక ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఒప్పందాల్లో అమెజాన్ ఏకపక్ష నిబంధనలను పొందుపరిచిందని.. వినియోగదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సేవలలో భారీ మార్పులు చేసిందని కన్జ్యూమర్ కమిషన్ ఆరోపించింది. ఈ మార్పుల వల్ల నవంబర్ 2023 నుంచి ఆగస్టు 2025 మధ్య కాలంలో ఆ దేశంలో దాదాపు 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ప్రభావితం అయ్యారని తెలిపింది.
ఆస్ట్రేలియాలో 2024 నుంచి ప్రైమ్ వీడియోలో ఎలాంటి సమాచారం లేకుండా అమెజాన్ ప్రకటనలను ప్రారంభించింది. దీంతో అప్పటికే ఏడాది మొత్తానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్న 8.5 లక్షల మంది చందాదారులు ప్రకటనలతో కూడిన వీడియోలను చూడాల్సి వచ్చింది. ఒకవేళ ప్రకటనలు లేకుండా వీడియోలను చూడాలనుకుంటే, సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా చెల్లించాలని నిబంధన విధించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి రూల్స్ పెట్టడం ముందస్తుగా పూర్తి రుసుము చెల్లించిన వినియోగదారులను అన్యాయం చేయడమేనని ఏసీసీసీ కోర్టుకు వివరించింది. ఈ వ్యవహారంపై వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కమిషన్ న్యాయస్థానాన్ని కోరింది. కాగా, ఈ కేసును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, దర్యాప్తునకు సహకరిస్తామని అమెజాన్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.