2022లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్‌కు బిగ్ రిలీఫ్ లభించింది.
ఈ వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ హైదరాబాద్ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది. రెండు వైపులా వాదనలు, సమర్పించిన సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రజాప్రతినిధుల కోర్టు.. రాజాసింగ్‌పై నమోదైన కేసులు, ఆయనపై మోపిన ఆరోపణలు సరైనవి కావని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదాస్పద కేసులో రాజాసింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తుది తీర్పును ఇచ్చింది.ఈ క్రమంలోనే స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్‌లో షో 2022 ఆగస్ట్ నెలలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మునావర్ ఫారూఖీ నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రాజాసింగ్.. ఆ షోను నిరసిస్తూ యూట్యూబ్ ద్వారా ఒక వీడియోను రిలీజ్ చేశారు. రాజాసింగ్ విడుదల చేసిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే రాజాసింగ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో చాలా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 153A(a)(b), 295A , 504, 505(2), 506 కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత 2022 ఆగస్టు 23వ తేదీన మంగళ్‌హాట్ పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్‌ను అరెస్ట్ చేసే ప్రక్రియలో పోలీసులు సరైన రూల్స్ పాటించలేదని పేర్కొన్న స్థానిక కోర్టు.. రాజాసింగ్‌ను రిమాండ్‌ను తరలించేందుకు తిరస్కరించింది. ఈ క్రమంలోనే రాజాసింగ్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల కస్టడీ నుంచి రాజాసింగ్ విడుదల అయిన తర్వాత హైదరాబాద్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో.. అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు 2022 ఆగస్ట్ 25వ తేదీన మంగళ్‌హాట్ పోలీసులు.. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఆ తర్వాత రాజాసింగ్ 77 రోజుల పాటు జైలులో ఉన్న తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. తాజాగా ఆ కేసులోనే రాజాసింగ్‌కు ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది.