
SC Judicial Experience Relief : న్యాయశాస్త్ర పట్టభద్రులకు సుప్రీ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. దిగువ కోర్టుల్లో న్యాయమూర్తులుగా ఎంపిక అయ్యేందుకు వీలుగా నిర్వహించే ప్రాథమిక స్థాయి జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించి కీలక సడలింపులు ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జడ్జి పోస్టులకు పోటీ పడటానికి న్యాయవాదిగా కనీసం మూడేళ్ల వృత్తి అనుభవం తప్పనిసరిగా ఉండాలంటూ గతంలో విధించిన కఠిన నిబంధనను న్యాయస్థానం సడలించింది. ఏడాది అనుభం ఉంటే చాలని తేల్చి చెప్పింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.మూడేళ్ల నిబంధన సడలింపు..!సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎ.జి.మాసిహ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీ ప్రాతిపదికన ఈ తీర్పును వెలువరించింది. కొత్త ఆదేశాల ప్రకారం.. జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలు రాయడానికి ఒక ఏడాది పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంటే చాలు. గతంలో అనగా 2025 మే నెలలో నాటి సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పరీక్ష రాయాలంటే మూడేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలని చెప్పింది. కానీ ఈ నిబంధనను సవరించాలని కోరుతూ ఇటీవలే కొన్ని పిటిషన్లు దాఖలు కాగా.. విచారించిన ధర్మాసనం ఈ కీలక సవరణలు చేసింది.2025 తీర్పు వెలువడి ఇప్పటికే ఒక సంవత్సరం కాలం పూర్తయినందున.. అప్పటి తాజా లా గ్రాడ్యుయేట్లు అందరూ ఇప్పటికే ఏడాది పాటు వృత్తి అనుభవం గడించినట్లుగానే భావిస్తున్నామని సీజేఐ తెలిపారు. దీనికోసం అభ్యర్థులు ప్రత్యేకంగా ఎలాంటి అనుభవ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వీరంతా పరీక్ష రాసేందుకు అర్హత ఉన్నవాళ్లేనని అన్నారు. అయితే ఈ పరీక్ష ద్వారా జడ్జీలుగా ఎంపికైన అభ్యర్థులు నేరుగా విధులు నిర్వహించడానికి వీలుండదు. వారు విధుల్లో చేరే ముందు రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ పొందాల్సి ఉంటుంది.ఇందులో భాగంగానే.. మొదటి ఏడాది జ్యుడీషియల్ అకాడమీలో సమగ్రహమైన శిక్షణ పూర్తి చేయాలి. రెండో సంవత్సరం న్యాయవాది గుమాస్తాగా పని చేయాల్సి ఉంటుంది. ఈ క్లర్క్షిప్ కాలంలో మొదటి ఆరు నెలలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ లేదా జిల్లా సెషన్స్ జడ్జి పర్యవేక్షణలో పనిచేయాలి. మిగిలిన ఆరు నెలలు హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాలి. ఈ రెండేళ్ల పరివర్తన కాలంలో అభ్యర్థుల పనితీరు, సామర్థ్యాలను నిపుణులు పూర్తిగా మదింపు చేసిన తర్వాతే వారిని పూర్తిస్థాయి న్యాయాధికారులుగా నియమిస్తారు.2027 నుంచి వర్తించే కొత్త నిబంధనలివే..!ఈ తాత్కాలిక సడలింపుల సమయం పూర్తయిన తర్వాత అంటే 2027 ఏప్రిల్ 1 నుంచి వెలువడే సివిల్ జడ్జి (జూనియర్ జడ్జి) నియామక నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా న్యాయవాది వృత్తిలో కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ కొత్త విధానం ఐదేళ్ల పాటు అమలులో ఉంటుందని, ఆ తర్వాత దీని ఫలితాలను సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. కాగా మెజారిటీ న్యాయమూర్తుల తీర్పుతో జస్టిస్ వినోద్ చంద్రన్ విభేదిస్తూ రివ్యూ పిటిషన్లను తోసిపుచ్చడం గమనార్హం.





