
ప్రస్తుతం డిజిటల్ ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊపేస్తోంది. కేవలం టెక్నాలజీ రంగాలకే పరిమితం కాకుండా, వినోద పరిశ్రమలో కూడా క్రియేటివీటి రెక్కలు తొడుగుతోంది. టెక్స్ట్ లేదా చిన్న ఫోటో ఇస్తే చాలు.. అద్భుతమైన సినిమాటిక్ వీడియోలను జనరేట్ చేసే స్థాయికి ఏఐ టెక్నాలజీ చేరుకుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు, క్రియేటర్లు పాత సినిమాల్లోని ఐకానిక్ సీన్లు, విషాదభరిత క్లైమాక్స్‌లను తమ ఊహకు తగ్గట్టుగా రీ క్రియేట్ చేస్తూ ‘ఆల్టర్నేటివ్ ఎండింగ్స్’ రూపొందిస్తున్నారు. తమకు నచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ సృష్టిస్తున్న ఇలాంటి ఏఐ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.* 70ఏళ్ల వయసులో టీనేజ్ ఎనర్జీ... లేటెస్ట్ ఫోటోషూట్‌తో రచ్చ లేపుతోన్న మెగాస్టార్ చిరంజీవి‘భట్టు’ సరికొత్త యాక్షన్ అవతార్ఈ ఏఐ ట్రెండ్‌లో భాగంగా తాజాగా టాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ ట్రాక్‌పై రూపొందించిన ఒక వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ‘అదుర్స్’ చిత్రంలో అమాయకమైన బ్రాహ్మణుడిగా, వన్ సైడ్ లవర్‌గా కనిపించిన ‘భట్టు’ పాత్రను ఇందులో ఏకంగా ఒక మాస్ యాక్షన్ హీరోగా మార్చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక రెస్టారెంట్లో భట్టు ప్రశాంతంగా కూర్చుని బిర్యానీ తింటూ ఉంటాడు. అదే సమయంలో వెనుక టేబుల్ వద్ద ఉన్న చంద్రకళను కొందరు రౌడీలు వేధిస్తుంటారు. భయంతో వణికిపోయిన ఆమె తనను కాపాడమని భట్టును సహాయం కోరుతుంది. ఇంకేముంది.. తన ప్రియురాలిని ఏడిపిస్తున్నారని తెలియగానే భట్టులోని అసలైన యాక్షన్ హీరో నిద్రలేస్తాడు. రౌద్రరూపం దాల్చి ఆ రౌడీలందరినీ చితక్కొట్టేస్తాడు. ఒక రౌడీని అయితే భట్టు తన కాలితో బలంగా తన్నగా, అతడు రెస్టారెంట్ గ్లాస్ విండోను పగలగొట్టుకుంటూ బయటపడతాడు. భట్టు ధైర్యాన్ని చూసి ముగ్ధురాలైన చంద్రకళ పరుగున వచ్చి భట్టును గట్టిగా కౌగిలించుకుంటుంది. వెంటనే భట్టు ఆమె భుజంపై చేయి వేసి ఎంతో ప్రేమగా "ఆర్ యూ ఓకే చందూ?" అని అడగ్గా, ఆమె మురిసిపోతూ "అవును" అని చెబుతుంది.‘అదుర్స్’లో ఎవర్గ్రీన్ కామెడీ ట్రాక్2010లో వచ్చిన ‘అదుర్స్’ చిత్రంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పోషించిన ‘భట్టాచార్య’ (భట్టు), నయనతార నటించిన ‘చంద్రకళ’ (చందు) మధ్య సాగే సన్నివేశాలు తెలుగు సినీ చరిత్రలోనే అత్యుత్తమ కామెడీ ట్రాక్స్‌లో ఒకటిగా నిలిచాయి. భట్టు మనసులో చంద్రకళపై అమితమైన, స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కంటాడు. కానీ చంద్రకళ మాత్రం స్వార్థంతో తన అవసరాల కోసమే భట్టును వాడుకుంటుంది. ఆమె చేతిలో అమాయకంగా మోసపోయి భట్టు పడే పాట్లు, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పండించిన కామెడీ థియేటర్లలో నవ్వుల పూలు పూయించింది. సినిమాలో భట్టు ప్రేమ విఫలమై కేవలం హాస్యానికే పరిమితమైంది. చివరికి చారి-చందు పెళ్లి చేసుకుని కవల పిల్లల్ని కంటే వాళ్ల బాగోగులు చూసుకునేవాడిగా భట్టు పాత్ర ముగుస్తుంది.* నాగార్జున బర్త్‌డే స్పెషల్… 4K హంగులతో మళ్లీ మురిపించనున్న ‘గీతాంజలి’నెటిజన్ల సరదా కామెంట్లుసినిమా విడుదలై దాదాపు 16 ఏళ్లు గడిచిన తర్వాత ఏఐ పుణ్యమా అని భట్టుకు తన చిరకాల కోరిక తీరి చంద్రకళ ప్రేమ దక్కడంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఏఐ సాధించిన అతిపెద్ద విజయం ఇదే.. ఎట్టకేలకు భట్టు ప్రేమ ఫలించింది, నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదని భట్టు నిరూపించాడు, భట్టుతో పెట్టుకుంటే బాక్సులు బద్దలే... అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. టెక్నాలజీకి సరైన క్రియేటివీ తోడైతే పాత జ్ఞాపకాలు కూడా సరికొత్త వినోదాన్ని ఎలా పంచుతాయో ఈ ఏఐ వీడియో మరోసారి నిరూపిస్తోంది.





