
ఒకే లాంటి కథలు.. ఒకే రకమైన బ్యాక్ డ్రాప్.. దాదాపు ఒకే తరహా పాత్రలు. అయినా ఒక ఇండస్ట్రీలో సినిమా హిట్ కావడానికి కావాల్సిన లెక్కలు, మరో ఇండస్ట్రీలో సినిమా వర్కౌట్ అయ్యే విధానం కాస్త వేర్వేరుగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు, మలయాళ సినిమాలను గమనిస్తే ఆ డిఫరెన్స్ మరింత క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి తెలుగులో ప్రేక్షకులను మెప్పించిన ఇన్వెస్టిగేషన్, క్రైమ్ కథలు చాలా ఉన్నాయి. స్టార్ హీరోలతో చేసిన సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అదే సమయంలో హీరో ఇమేజ్ ను పక్కనపెట్టి స్టోరీ, రోల్స్, ఇన్విస్టిగేషన్ చుట్టూ నడిచిన సినిమాలు మంచి రిజల్ట్స్ అందుకున్నాయి. అంటే ఆ కథలకు తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ లేదని చెప్పలేం. కానీ మలయాళం దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి కాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఇలాంటి కథలు వరుసగా వచ్చినా ప్రేక్షకుల్లో ఇంట్రెస్టింగ్ తగ్గడం లేదు.
ఒక సినిమా తర్వాత మరో సినిమా అదే తరహా బ్యాక్ డ్రాప్ తో వచ్చినా.. స్టోరీ, ట్రీట్మెంట్, పాత్రల విషయంలో కొత్తదనం చూపించగలిగితే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడే అసలు తేడా కనిపిస్తోంది. తెలుగులో ఒక సినిమాకు హీరో ఇమేజ్ చాలా సందర్భాల్లో మెయిన్ స్ట్రెంత్ గా మారుతుంది. స్టోరీతోపాటు హీరోయిజం, యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకుల అంచనాల్లో భాగమవుతాయి. ఇవన్నీ సరిగ్గా సెట్ అయితే సినిమా భారీ రేంజ్ లో వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
మాలీవుడ్ లో మాత్రం చాలా సందర్భాల్లో కథే ముందుకు వస్తుంది. రోల్ ఎంత పెద్దది అనేదానికంటే.. ఆ రోల్ ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, దాని వెనుక ఉన్న నిజం ఎలా బయటపడుతుందనే అంశాలపై ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతారు. అందుకే అక్కడ పెద్ద స్టార్ లేకపోయినా కథపై నమ్మకంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ముఖ్యంగా నేచురల్ రోల్స్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, యాక్టింగ్ తో నార్మల్ గా అనిపించే కథను ఇంట్రెస్టింగ్ గా మార్చగలుగుతున్నారు.
ఇది తెలుగు సినిమాకు లేని స్ట్రెంత్ అని కాదు. మన దగ్గర కూడా నేచురల్ స్టోరీతో, స్ట్రాంగ్ రోల్స్ తో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. కానీ ఇలాంటి కథలకు మలయాళంలో ఏర్పడిన ఫ్యాన్ బేస్ మాత్రం స్పెషల్. అక్కడ ఒకే తరహా నేపథ్యంతో సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ముందుగానే విసిగిపోవడం లేదు. ఎందుకంటే ప్రతి సినిమా తనదైన ట్రీట్మెంట్ తో వస్తోంది.
కథ పాతదే అయినా.. దాన్ని చెప్పే విధానం కొత్తగా ఉంటే చాలు అనే నమ్మకం అక్కడ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని తెలుగు సినిమాలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అలా రెండు ఇండస్ట్రీల్లోనూ ఒకే లాంటి కథలకు ప్రేక్షకుల రెస్పాన్స్ ఉంది. అయితే డిఫరెన్స్ జానర్ లో కాదు.. ఆ జానర్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే విధానంలోనే ఉంది.






