
© 2026 nimisham.in


KTR And Harish Rao Arrested : తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్ సభ్యుల తీరును నిరసిస్తూ మంగళవారం సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫామ్‌హౌస్ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్ పార్టీ పిలుపు నివ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్దెత్తున తరలివచ్చారు. కార్యకర్తలు ఫామ్ హౌస్ సమీపంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బారికేడ్లు, రోప్ పార్టీతో కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతల వాహనాలపై రాళ్లదాడికి పాల్పడడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
Also Read : Telangana Politics : బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దుకు రంగం సిద్ధం..! న్యాయనిపుణులతో సీఎం రేవంత్, భట్టి భేటీ
ఫామ్‌హౌస్ వద్ద పరిణామాలతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి నేరుగా ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్దకు బయటుదేరారు. వాహనాల్లో వెళ్తున్న వీరిని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బొల్లారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. హకీంపేట వద్ద కేటీఆర్, హరీశ్ రావులను నిలిపివేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై కేటీఆర్, హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవల్లికి పాదయాత్రగా బయలుదేరారు. ప్రభుత్వమే పోలీసుల సహాయంతో కాంగ్రెస్ నేతలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
హకీంపేట్ దాటిన తరువాత కేటీఆర్, హరీశ్ రావులతోపాటు బీఆర్ఎస్ సీనియర్ నేతలను, మాజీ మంత్రులను పోలీసులు అరెస్టు చేసి.. ఆయా స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇంటికి మేము వెళ్తుంటే మమ్మల్ని, మా పార్టీ సభ్యులను బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, పక్క జిల్లాల నుంచి వచ్చిన జనాలకు కేసీఆర్ ఇంటి వరకు దారి చూపిస్తూ, బీఆర్ఎస్ నేతలను మాత్రం అరెస్ట్ చేయడం ఏరకమైన న్యాయం? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఎలాంటి హాని జరిగినా దానికి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగమే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అరెస్టు అనంతరం హరీశ్ రావును జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు, కేటీఆర్‌ను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.








