
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో, తిరుపతి జిల్లా పోలీసులు భక్తులకు కొన్ని కీలక సూచనలు అందించారు. ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో, తిరుపతి జిల్లా పోలీసులు భక్తులకు కొన్ని కీలక సూచనలు అందించారు. ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు వార్తలు, వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. భక్తులు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం టీటీడీ మరియు తిరుపతి పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాలని స్పష్టం చేశారు. పాత ఫోటోలు, వీడియోలను ప్రస్తుత ఘటనలుగా చిత్రీకరించి చేసే పోస్టులతో జాగ్రత్తగా ఉండాలని, పోలీసు లేదా టీటీడీ లోగో ఉన్న సమాచారం అధికారికమైనదని భావించవద్దని వారు హెచ్చరించారు. ప్రమాదాలు, తొక్కిసలాటలు జరిగాయని, మార్గాలు మూసివేశాయని వచ్చే నిర్ధారణ లేని సందేశాలు చూసి భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రత మరియు సౌకర్యాలను కాపాడేందుకు తిరుమల మరియు తిరుపతిలో విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయబడ్డాయని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. మొత్తం 6,071 మంది పోలీసు సిబ్బందిని రెండు దశల్లో బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. వీరిలో 4,783 మంది తిరుమలలో, 1,288 మంది తిరుపతిలో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి క్రౌడ్ మేనేజ్మెంట్, భక్తులతో వ్యవహరించాల్సిన తీరు, తిరుమల పవిత్రత పరిరక్షణ వంటి అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. భక్తుల్లో భయాందోళనలు సృష్టించే పోస్టులు కనిపిస్తే, వాటి స్క్రీన్షాట్లు లేదా లింకులను పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం డయల్ 112కు ఫోన్ చేయాలని లేదా దగ్గర్లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆశ్రయించాలని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసుల సూచనలు, అధికారిక మైక్ ప్రకటనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో స్వామివారి సేవలో పాల్గొనాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




