
MDR-GST | దిల్లీ: యూపీఐ లావాదేవీలకు సంబంధించి పెద్ద వ్యాపారులకు ఎండీఆర్‌తో పాటు మరో భారం కూడా పడనుంది. రూ.2,000కు మించి జరిపే యూపీఐ చెల్లింపులపై వర్తించే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటుపై (MDR) వ్యాపారులు 18 శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే వారు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC)ను పొందడం ద్వారా మొత్తం పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చని పన్ను నిపుణులు చెబుతున్నారు. వ్యక్తులు రూ.2వేలు పైబడి వ్యాపారులకు చేసే యూపీఐ చెల్లింపులపై అక్టోబర్‌ 15 నుంచి 0.4 శాతం ఎండీఆర్‌ అమల్లోకి రానుంది. గరిష్ఠ పరిమితిని రూ.300గా కేంద్రం నిర్ణయించింది. రైల్వే, టెలికాం, బీమా, పెట్రోల్‌ బంకుల్లో ఫ్లాట్‌ రేటు రూ.5గా నిర్ణయించారు. ప్రతిపాదిత విధానం ప్రకారం చెల్లింపు సేవలు వినియోగించుకున్నందుకు గానూ ఎండీఆర్‌ భారాన్ని వ్యాపారులే భరించాల్సి ఉంటుంది. దీనికి 18 శాతం జీఎస్టీ కూడా వర్తిస్తుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఎండీఆర్‌పై 18 శాతం జీఎస్టీ విధించడం వల్ల ఏటా రూ.3,500 నుంచి రూ.4వేల కోట్ల ఆదాయం సమకూరనుందని ఏఎంఆర్‌జీ గ్లోబల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ రజత్‌ మోహన్‌ వెల్లడించారు. అయితే, ఈ రుసుములను భరించే నమోదిత వ్యాపారులు చెల్లించిన జీఎస్టీపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చని చెప్పారు. లావాదేవీ విలువతో సంబంధం లేకుండా 0.4 శాతం మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటుపై మాత్రమే 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని మరో పన్ను నిపుణుడు శివకుమార్‌ రమ్జీ తెలిపారు. జీఎస్టీ పరిధిలో ఉన్న వారు ఐటీసీ ద్వారా మినహాయింపు ఈ భారం తగ్గించుకోవచ్చని, జీఎస్టీ వెలుపల ఉన్న వ్యాపారులు మాత్రం ఎండీఆర్‌ ఛార్జీలతో పాటు దానిపై జీఎస్టీ భారమూ భరించాల్సి ఉంటుందని తెలిపారు. యూపీఐపై ఛార్జీల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గే ఉద్దేశమేదీ లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక పునరాలోచన చేసే అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు స్పష్టంచేశారు. యూపీఐని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఎండీఆర్‌ ఛార్జీల విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిందని తెలిపారు. ఎండీఆర్‌ ఛార్జీలపై విపక్ష పార్టీలు, ట్రేడర్ల నుంచి వ్యతిరేకత వస్తున్న వేళ ప్రభుత్వం నుంచి ఈ స్పందన వెలువడింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





