
Paytm CEO on UPI charges | ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ ఛార్జీలు (UPI Charges) విధించడాన్ని పేటీఎం ( Paytm ) వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ స్వాగతించారు. సామాన్యులకు, చిరు వ్యాపారులకు ఊరట కల్పిస్తూ ‘రాబిన్‌ హుడ్‌’ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. రూ.2 వేలు పైబడిన నిర్దిష్ట లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ విధిస్తూ ఎన్‌పీసీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఇతర చెల్లింపుల వ్యవస్థలకు చాలా రోజులుగా ఛార్జీలు వర్తిస్తున్నాయి. ఇప్పటివరకు యూపీఐ వ్యవస్థ చాలా వరకు ప్రభుత్వ సాయంపైనే నడుస్తోంది. పెద్ద పెద్ద ఇ-కామర్స్ సంస్థలు, పెద్ద రిటైల్ చైన్‌లు చేసే పెద్ద లావాదేవీలపై ఛార్జీలు విధించడం ద్వారా వచ్చే ఆదాయం.. సాధారణ వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు యూపీఐని ఎప్పటికీ ఉచితంగా అందించడానికి సహాయపడుతుంది. ఈ నిర్ణయం యూపీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఏదో ఒకరోజు ఈ రుసుము వర్తిస్తుందని ముందుగా ఊహించినదే. చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడుతూ ఛార్జీలపై నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది’’ అని విజయ్‌ శేఖర్‌ శర్మ అన్నారు. ఎండీఆర్‌ ఛార్జీల ప్రకటన నేపథ్యంలో పేటీఎం వంటి పలు ఫిన్‌టెక్‌ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ స్టాక్‌ ఇంట్రాడేలో ఏకంగా 7.24 శాతం లాభపడి రూ.1856.50 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. వన్‌మొబిక్విక్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ షేర్లు కూడా 5.96 శాతం, పైన్‌ల్యాబ్స్‌ 2.68 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే, లాభాల స్వీకరణతో పేటీఎం లాభాలు పరిమితం కాగా.. మొబిక్విక్‌, పైన్‌ల్యాబ్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.