
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Bonalu Festival: 'బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు సరే నిధులేవి? హైదరాబాద్‌లో 3,400 ఆలయాలు ఉంటే బోనాల ఉత్సవాలకు రూ.20 కోట్లు విదిలిస్తారా? రంజాన్ పండుగకు మాత్రం రూ.33 కోట్లు విడుదల చేస్తారా? బోనాల ఉత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు ప్రస్తావిస్తే మతం పేరుతో చిచ్చు పెట్టాలని మాట్లాడతారా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఇస్తే...80 శాతం మంది హిందువుల పండుగకు ఇంకెన్ని కోట్లు ఇవ్వాలి. విదేశాలు నిషేధించిన తస్లీమా జమాతే సంస్థ సభకు కూడా కాంగ్రెస్ రూ.2.40 కోట్లు విడుదల చేస్తారా? నేను హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తా' అని బండి సంజయ్ ప్రకటించారు. గోమాతను వధిస్తే ప్రశ్నించాలా? వద్దా? అని నిలదీశారు. హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తే ప్రశ్నించాలా? వద్దా? అని ప్రశ్నించారు. 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపుతానంటే ప్రశ్నించవద్దా? తాను బరాబర్ సనాతన ధర్మం కోసం పని చేస్తానని బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు.
'హిందువులంతా జాగృతం కావాలి. హిందువులారా జెన్‌జీలను స్పూర్తిగా తీసుకోండి. ఆకాశంలో రాకెట్లను పంపడమే కాదు హిందూ సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు. జెన్జీల తీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. 'ఎన్నికలకు బోనాలకు సంబంధమే లేదు. బీజేపీ స్వచ్ఛంద సంస్థ కాదు రాజకీయ పార్టీ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని.. హైడ్రా 150 పోస్టులకు ఫిజికల్ టెస్ట్ పెడితే సరూర్ నగర్ స్టేడియం నిండిపోవడమే నిదర్శనమని పేర్కొన్నారు.
హిందూ సమాజమంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మైనారిటీ సంతూష్టీకరణ విధానాలనే ఆ పార్టీలు అవలంభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మైనారిటీ సంతూష్టీకరణ విధానాలకు పూర్తి వ్యతిరేకం అని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్రను ఎందుకు పాఠ్యాంశాల్లో చేర్చలేదని ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ దీపావళి నాడు ఆలయంలో వెయ్యి మంది మహిళలను, పిల్లలను కాల్చి చంపిన నీచుడు అని చెప్పారు. అట్లాంటి దుర్మార్గుడిని హీరో చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయన విగ్రహాలు పెట్టడం కరెక్టేనా? అని నిలదీశారు. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకించారని బండి సంజయ్ ప్రశ్నించారు.
'ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానన్న హామీ ఏమైంది? ఉద్యోగాలను భర్తీ చేసేదాకా నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తానన్న హామీ ఏమైంది? రోజ్ గార్ మేళాతో 12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత మోదీదే. ఫీజు రీయింబర్స్ మెంట్ అందక పేద విద్యార్థులు అల్లాడుతున్నారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు' అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. 'సమాజాన్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టించింది. ఇచ్చిన హామీలను కూడా అమలు చేయని మోసపూరిత చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మహాలక్ష్మీ పథకం కింద నెలనెలా ఎంత మంది మహిళలకు రూ.2,500 ఇచ్చారు. వృద్దాప్య పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని మోసం చేయలేదా?' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.





