
Russian Shadow Fleet Captain Arrest : రష్యాకు చెందిన 'షాడో ఫ్లీట్' ఆయిల్ ట్యాంకర్‌గా అనుమానిస్తున్న ఒక నౌకపై బ్రిటన్ దళాలు మెరుపు దాడి చేసి, దాని కెప్టెన్‌గా ఉన్న 38 ఏళ్ల అజయ్ పంత్ అనే భారతీయుడిని బంధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన భార్య రితూ పంత్.. తన భర్తను కావాలనే బలిపశువును చేశారని మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు.ఇంగ్లీష్ ఛానెల్లో 6 గంటల భీకర ఆపరేషన్..జూన్ 14వ తేదీన ఇంగ్లీష్ ఛానెల్ గుండా ప్రయాణిస్తున్న 'స్మిట్రోస్' అనే చమురు ట్యాంకర్‌ను బ్రిటన్ రాయల్ మెరైన్ కమాండోలు, ఎన్సీఏ అధికారులు చుట్టుముట్టారు. కామెరూన్ దేశ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకపై దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించి దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జూన్ 5వ తేదీన రష్యా ఓడరేవు నుంచి 98 వేల టన్నుల చమురు లోడుతో ఈజిప్టునకు బయల్దేరిన ఈ నౌక.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా నడుపుతున్న రహస్య నెట్‌వర్క్‌లో భాగమని బ్రిటన్ దళాలు ఆరోపిస్తున్నాయి. నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉండగా.. కేవలం కెప్టెన్ అజయ్ పంత్‌ను మాత్రమే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ నౌకను ఇంగ్లాండ్ దక్షిణ తీరంలోని ఒక సురక్షిత ప్రాంతంలో నిలిపి ఉంచారు.10 ఏళ్ల జైలు శిక్ష ముప్పు..అరెస్టు అనంతరం అజయ్ పంత్‌ను బ్రిటన్ కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ ఆంక్షల ఉల్లంఘన కేసులో ఆయనపై నేరం రుజువైతే గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. "నా భర్త నౌక యజమానుల వద్ద పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి మాత్రమే. యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలనే ఆయన పాటించారు. తాను ఏం తప్పు చేశానో కూడా అర్థం కాక, చేయని తప్పునకు జైలు గోడల మధ్య కుమిలిపోతున్నారు" అని భార్య రితూ పంత్ ఆవేదన వ్యక్తం చేశారు.కోర్టులో సాగుతున్న హోరాహోరీ వాదనలు..!నౌకలో ఉన్న 98 వేల టన్నుల అక్రమ చమురు సమాచారం కెప్టెన్‌గా అజయ్‌కు ముందే తెలుసని బ్రిటిష్ ప్రాసిక్యూషన్ కోర్టులో వాదించింది. అయితే ఈ ఆరోపణలను అజయ్ తరఫు న్యాయవాది గట్టిగా తిప్పికొట్టారు. ఒక నౌక కెప్టెన్ ప్రధాన బాధ్యత అందులోని సరుకును సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమేనని, ఆ కార్గో వెనుక ఉన్న అంతర్జాతీయ రాజకీయాలు లేదా ఆంక్షల వివరాలు విధుల్లో ఉన్న నావికులకు తెలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. డిసెంబరు 15వ తేదీ నుంచి ఈ కేసుపై కీలక విచారణ ప్రారంభం కానుంది. కాగా కాన్సులార్ అనుమతితో బ్రిటన్ జైలులో ఉన్న అజయ్ పంత్‌ను భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు కలిసి ఆయన యోగక్షేమాలను విచారించారు.





